అత్యుద్భుత అవకాశాన్ని మిస్ చేసుకున్న జగన్

లాజిక్ మిస్ అయిన ఆయన కోటరీ పుణ్యమా అని చరిత్రలో నిలిచిపోయే ఛాన్సును జగన్ మిస్ చేసుకున్నారన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది

Update: 2024-06-09 06:26 GMT

ఎవరు ఎవరిని ఓడించరు. తమను తామే ఓడించుకుంటారన్న సామెత ఒకటి ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఇదే నిజమనిపించకమానదు. చరిత్రలో నిలిచే ఛాన్సు చేజిక్కించుకున్న వేళ.. మిగిలినవన్నీ పక్కన పెట్టి ఆ దిశగా అడుగులు వేయాలి కదా? అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించారన్నది ప్రశ్న. లాజిక్ మిస్ అయిన ఆయన కోటరీ పుణ్యమా అని చరిత్రలో నిలిచిపోయే ఛాన్సును జగన్ మిస్ చేసుకున్నారన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. చంద్రబాబుకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశాన్ని ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వ్యాపారం కావొచ్చు.. రాజకీయం కావొచ్చు.. మరే రంగమైనా కావొచ్చు. తన ప్రత్యర్థి కంటే మిన్నగా వ్యవహరించటం.. పరుగు పందెంలో ముందు ఉండటం చేస్తారు. అంతేకాదు.. తమకు చెందాల్సిన క్రెడిట్ మొత్తాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. వీలైతే క్రెడిట్ లో ఎవరికి భాగస్వామ్యం దక్కకుండా చేసుకోవటమ తప్పేం కాదు. ఆట ఆడే ఏ ఆటగాడు ఆడని రీతిలో ఆలోచించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి అసెంబ్లీలోనూ..దాని బయటా తనకు అంగీకారం ఉందన్న జగన్.. తన చేతికి పాలనా పగ్గాలు వచ్చిన తర్వాత నుంచి ఒకటి ఎందుకుమూడు రాజధానులు అంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

దాని మీద వాదోపవాదాలు..కోర్టు కేసులతో కాలం గడిపేశారు. అందుకు భిన్నంగా తాను మాట ఇచ్చిన దానికి కట్టుబడి చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతిని.. జగన్ ఒక కొలిక్కి తీసుకొచ్చి ఉంటే.. చరిత్రలో అమరావతిని పూర్తి చేసిన ఘనత జగన్ కు దక్కేది కదా? అందుకు భిన్నంగా అమరావతిని పట్టించుకోకుండా.. తాను తెర మీదకు తీసుకొచ్చి మూడు రాజధానుల్ని మొదలు పెట్టక.. జగన్ సాధించిందేంటి?

అమరావతిని వదిలేశారు సరే. ఈ రోజున అధికారంలోకి వస్తున్న చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి ముందే.. తాను అధికారం కోల్పోయే నాటికి అమరావతి ఏ షేప్ లో ఉందో.. ఆ షేప్ లోకి రావాలన్న ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నామంటే.. అధికారాన్ని చేపట్టానికి ముందే ఇంత వేగంగా పనులు చేయిస్తున్నప్పుడు.. తన పదవీ కాలంలో అమరావతి పనుల వేగం అంతే స్థాయిలో ఉండే పరిస్థితి.

అదే జరిగితే అమరావతిని మొదలుపెట్టటటం.. పూర్తి చేసిన రెండు ఘనతలు చంద్రబాబు ఖాతాలోనే పడతాయి. అదే సమయంలో అమరావతిని అడ్డుకున్న చెడ్డపేరు మాత్రం జగన్ పేరు మీద చరిత్రలో నిలిచిపోతుంది. మరే ఆటగాడు తన ప్రత్యర్థి గురించి ఆలోచించని రీతిలో ఆలోచించి.. ఆయన్ను అందలం ఎక్కించేలా చేసిన ఘనత జగన్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. ఇదంతా చూస్తున్పప్పుడు అమరావతి విషయంలో జగన్ మాత్రమే కాదు ఆయన కోటరీ కూడా అసలుసిసలు లాజిక్ మిస్ అయ్యారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News