వాలంటీర్లకు ఎమ్మెల్యే టికెట్...జగన్ వ్యూహమేనా...?

ఇదిలా ఉంటే వాలంటీర్ల నియామకం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి ఇదొక అవకాశం అన్నారు.

Update: 2023-08-04 08:39 GMT

ఏపీలో వాలంటీర్లు ఇపుడు రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారారు. వారు అక్షరాలా రెండున్నర లక్షల మంది దాకా ఉన్నారు. వీరి విషయంలో వైసీపీ ఎపుడూ గర్వపడుతూ ఉంటుంది. ఆ పార్టీ నేతలు అయితే మాకు అతి పెద్ద సైన్యం అంటారు. అయితే వాలంటీర్లను రాజకీయాలకు ఎలా వాడుకుంటారు అని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తూ ఉంటాయి.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత డేటా ప్రజల నుంచి సేకరిస్తున్నారు అంటూ బాంబులే పేల్చారు. దాంతో జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. దాంతో వైసీపీ మంత్రులు కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. స్ట్రాంగ్ గా కౌంటర్లు వేసారు. ఇదే ఊపులో కొందరు వైసీపీ నాయకులు అయితే పవన్ మీద ఒక సాధారణ వాలంటీర్ ని పోటీకి పెట్టి ఓడిస్తామని కూడా సవాల్ చేశారు.

ఇదిలా ఉంటే వాలంటీర్ల నియామకం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి ఇదొక అవకాశం అన్నారు. ఆ విధంగా ముందుకు సాగితే ఉన్నతంగా ఎదగవచ్చు అని నాడు ప్రోత్సహించారు. అంటే వాలంటీర్లు ప్రతీ యాభై కుటుంబాలకు ఒకరు వంతున నిజంగా ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. అలాంటి వారు రేపటి రోజున లక్షలలో ప్రజలకు ఎందుకు ప్రతినిధులు కాకూడదు అన్న చర్చ కూడా ఉంది.

వాలంటీర్లలో రాజకీయ ఆసక్తి అనురక్తి ఉనన్ వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఇపుడు తమకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే రాజకీయాలకు చైతన్యంగా పేరు పొందిన గోదావరి జిల్లాల నుంచి ఒక వాలంటీర్ తనకు ప్రజా సేవ చేయాలని ఉందని అంటున్నారు. జగన్ కనుక చాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని అంటునారు.

అదెక్కడో కాదు, కాకినాడ జిల్లాలోని ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని రౌతులపూడి మండలం పారుపాక గ్రామానికి చెందిన సచివాలయ వాలంటీర్ గాడి మహేష్ త‌న‌కు ఎమ్మెల్యే కావాల‌ని ఉంద‌ని టిక్కెట్టు ఇవ్వాల‌ని ఏకంగా జగన్నే కోరుతున్నారు. జగన్ ఆనాడు నాయకులుగా ప్రతీ వాలంటీర్ ని చేస్తాను అని చెప్పారని, తనకు ఇపుడు నాయకుడు కావాలని ఉందని మహేష్ అంటున్నాడు. తనకు రాజకీయ పట్ల కోరిక ఉందని కూడా చెబుతున్నాడు.

ఈ మేరకు అపుడే మహేష్ ప్రచారం కూడా మొదలెట్టేశాడు. ఆయన బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. ప్రత్తిపాడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల తాను పోటీ చేస్తే నెగ్గడం ఖాయమని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇలా వాలంటీర్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వైసీపీలో అతి పెద్ద చర్చకు తవిస్తోంది. అయితే గ్రామ పెద్ద‌లు మాత్రం మహేష్ కోరికకు మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే ఇది మహేష్ కోరిక మాత్రమే కాదుట. వాళ్ల తండ్రి గాడి నూక రాజేశ్వరరావు కూడా గ‌తంలో పారుపాక‌ గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారని అంటున్నారు. ఆయన అప్పట్లో కాంగ్రెస్ , ప్రజారాజ్యం పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావించినా ఎందుకో కుదరలేదుట. అయితే ఇపుడు తన వారసుడు గాడి మ‌హేష్ పోటీకి సిద్ధ‌ప‌డుతుంటే తండ్రి సైతం ఓకే చెబుతున్నారు. ఇక మహేష్ సంగతి చూస్తే డిగ్రీ వ‌ర‌కూ చ‌దువుకున్న మహేష్ వాలంటీర్‌గా మంచి సేవ‌లు అందించి అంద‌రి మ‌న్న‌ల్ని పొందుతున్నాడ‌ని స్థానికులు చెబుతున్నారు.

అలా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కూ అగ్ర వర్ణానికి చెందిన అభ్య‌ర్థులే పోటీ చేసార‌ని అంటున్నారు. అందువల్ల వైసీపీ బీసీ నినాదం మేరకు ఈసారి టిక్కెట్టు బీసీ వ‌ర్గంకి ఇస్తే కనుక అది తనకే రావాలని మహేష్ గట్టిగా కోరుకుంటున్నాడు. మరి దీని మీద అధినేత జగన్ ఏమంటారో.

ఏది ఏమైనా వాలంటీర్లకు ఈసారి ఎన్నికల్లో టికెట్లు వైసీపీ రిజర్వ్ చేస్తుందా తాను క్రియేట్ చేసిన వ్యవస్థ నుంచి సమర్ధులైన వారిని ఎంచి కొత్త తరాన్ని నాయకత్వాన్ని సిద్ధం చేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. రాజకీయ అభిలాషతో పాటు అన్ని విధాలుగా సమర్ధులు అయిన వారికి టికెట్ ఇస్తే అది వాలంటీర్లకు కూడా నైతిక స్థైర్యాన్ని ఇస్తుందని అలాగే వాలంటీర్లు వైసీపీకి మరింతగా ప్లస్ అవుతారని కూడా అంటున్నారు. చూడాలి మరి వైసీపీ పెద్దల మదిలో ఏముందో.

Tags:    

Similar News