5 రోజుల జగన్ పులివెందుల ట్రిప్ 3 రోజులకే ముగిసిందెందుకు?

అంతేకాదు.. పెద్దోళ్లు బాగానే ఉన్నారని.. చిన్నోళ్లమైన తామే ఇరుక్కుపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. తాము అన్యాయం అయ్యామంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

Update: 2024-06-25 05:40 GMT

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లోనూ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం అనంతరం తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఐదు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండేందుకు సమయాన్ని కేటాయించని జగన్.. ఈసారి అందుకు భిన్నంగా పులివెందులలో ఐదు రోజుల పాటు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే.. మూడు రోజులకే పులివెందుల నుంచి బెంగళూరుకు హెలికాఫ్టర్ లో వెళ్లిపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

ఐదు రోజుల ట్రిప్ మూడు రోజులకే ఎందుకు ముగిసింది? ట్రిప్ మధ్యలోనే ఎందుకు బెంగళూరు వెళ్లిపోయారు? అన్నదిప్పుడు పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ చర్చగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కిందిస్థాయి నేతలు.. పులివెందుల కౌన్సిలర్ల తలనొప్పులే టూర్ కుదింపునకు కారణంగా చెబుతున్నారు. వివిధ పనుల కింద అప్ లోడ్ చేసిన రూ.230 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండటం.. నడుస్తున్న పనులకు సంబంధించిన మరో రూ.100 కోట్ల పనుల బిల్లుల మాటేమిటి? అన్న ఫాలో అప్ నకు ఎంత చెప్పినా వినని ఛోటా నేతల తీరుకు జగన్ అండ్ కో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లుగా చెబుతున్నారు.

పులివెందులకు వచ్చిన నాటి నుంచి పెండింగ్ బిల్లులు ఉన్న కౌన్సిలర్లు అదే పనిగా జగన్ ను.. ఆయన సతీమణి భారతిని కలిసి తమ సంగతి చూడాలంటూ తెగ ఇబ్బంది పెట్టటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికల వేళలో తమ బిల్లులు క్లియర్ కాలేదని.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి చెందిన బిల్లులు.. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లుల్ని క్లియర్ చేసిన వైనాన్ని వారి ముందుకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. పెద్దోళ్లు బాగానే ఉన్నారని.. చిన్నోళ్లమైన తామే ఇరుక్కుపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. తాము అన్యాయం అయ్యామంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారిని సముదాయించేందుకు భారతి ప్రయత్నించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. రోజూ పెండింగ్ బిల్లుల పంచాయితీతో జగన్ అసౌకర్యానికి గురి కావటంతో పాటు.. అదే పనిగా ఆ విషయాన్నే చెప్పటం ఏమిటంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. వారిలో కొందరు భారతి వద్దకు వెళ్లి తమ పెండింగ్ బిల్లుల విషయంలో సరైన హామీ రాకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామంటూ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా సమాచారం. దీంతో.. చికాకుకు గురైన జగన్ పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ వైనం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.

Tags:    

Similar News