వైఎస్సార్ చేయలేనిది... జగన్ చేయాల్సిన అవసరం ఉంది !
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల తరువాత జగన్ జనంలోకి వెళ్ళింది పెద్దగా లేదు తొలి రెండేళ్ళూ కరోనాతో పోయింది. ఆ తరువాత జగన్ జిల్లాలలో ప్రభుత్వ పధకలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమం పేరిట పర్యటిస్తున్నారు.
వైఎస్సార్ తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ ఇపుడు తన ఇమేజ్ తోనే 2024 ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. తాను ఇచ్చిన హామీలు అన్నీ కూడా జనంలో చర్చకు పెట్టి వారి ఫలితాలనే ఎన్నికల్లో విజయాలుగా మార్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల తరువాత జగన్ జనంలోకి వెళ్ళింది పెద్దగా లేదు తొలి రెండేళ్ళూ కరోనాతో పోయింది. ఆ తరువాత జగన్ జిల్లాలలో ప్రభుత్వ పధకలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమం పేరిట పర్యటిస్తున్నారు.
అది పూర్తిగా అధికార కార్యక్రమంగా ఉంటోంది. ఇక విపక్షాలు చూస్తే చాలా దూకుడు చేస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో నారా లోకేష్ యువగళం పేరిట భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రతీ రోజూ జనంలో ఉంటున్నారు. సభలు పెట్టి మరీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నారు.
అదే విధంగా చంద్రబాబు ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా జిల్లాల పర్యటనలతో పాటు సభలు పెడుతూ వస్తున్నారు. ఆయన మెయిన్ స్ట్రీం మీడియాతో పాటు సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటూ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలా ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వరాహి యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలలో రాజకీయ కాక పుట్టించారు. విశాఖ జిల్లాలో మూడవ విడత యాత్రను ఆయన పూర్తి చేశారు.
పవన్ అయితే చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. వాటిని మంత్రుల నుంచి కౌంటర్లు వచ్చినా ముప్పేటగా జరుగుతున్న ప్రతిపక్షాల దాడి నుంచి వైసీపీ ప్రభుత్వం తట్టుకోవాలీ అంటే జగన్ జనంలోకి వెళ్ళి తీరాల్సిందే అన్న భావన అయితే ఉంది. ఇక దానికి ఎక్కువ టైం కూడా లేనందున తొందరలోనే జగన్ ప్రజలలోకి వెళ్ళేందుకు వీలుగా ఒక భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు.
అప్పట్లో అంటే 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ పేరిట ఒక కార్యక్రమం రూపకల్పన చేసి డైరెక్ట్ గా జనం తో ఇంటరాక్ట్ అయ్యేందుకు వైఎస్సార్ వేసిన ప్లాన్ అయితే నెరవేరలేదు. ఆయన అదే రోజున హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. దాంతో రచ్చబండ వాయిదా పడిపోయింది. ఇక వైఎస్సార్ తరహాలో జగన్ కూడా రచ్చబండ పేరిట జనంలోకి రానున్నారు అని చాలా కాలంగా వినిపించింది.
ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారు. కానీ కరోనా రావడంతో అది అలా ఆగింది. ఇపుడు ఎటూ ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల జగన్ రచ్చబండ పేరిట పూర్తి స్థాయిలో ప్రజలలోకి రానున్నారు అని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గం కవర్ అయ్యేలా రచ్చబండను రూపకల్పన చేస్తున్నారు అని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గంలో జగన్ రెండు రోజుల పాటు ఉంటారని, స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని అక్కడికక్కడ పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ పధకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయన్న దాని మీద కూడా తనదైన శైలిలో ఆరా తీస్తారని అంటున్నారు. ఎన్నికలకు గడువు తక్కువగా ఉంది. పైగా ముందస్తు ఎన్నికలు వస్తే సమయం కూడా ఉండదు కాబట్టి జగన్ సాధ్యమైనంత తొందరలోనే రచ్చబండ పేరిట జనంలోకి వస్తారని అంటున్నారు.
ప్రస్తుతం విదేశాలలో ఉన్న జగన్ ఈ నెల 12న ఏపీకి చేరుకుంటారు. ఆ తరువాత మంత్రివర్గం సమావేశం అయి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అంటున్నారు. అవి ఈ నెలాఖరు వరకూ కొనసాగుతాయని కూడా చెబుతున్నారు. అంటే అక్టోబర్ లో జగన్ రచ్చబండ కార్యక్రమం మొదలవుతుంది అని అంటున్నారు.