వైసీపీ కాంగ్రెస్ లో విలీనం... క్లారిటీ వచ్చేసిందా ?

వైసీపీకి భారీ ఓటమి తరువాత నేతలు అంతా నిరాశలో కృంగిపోయారు. పార్టీ ఉంటుందా అన్న చర్చ కూడా సాగింది

Update: 2024-06-25 17:18 GMT

వైసీపీకి భారీ ఓటమి తరువాత నేతలు అంతా నిరాశలో కృంగిపోయారు. పార్టీ ఉంటుందా అన్న చర్చ కూడా సాగింది. సరిగ్గా ఇదే సమయంలో ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇందులో ఏది నిజం అన్నది తేల్చుకో లేకుండా ఉంది.

ఎందుకు అంటే అధినేత జగన్ సైతం నైరాశ్యంగా కనిపించడం, పార్టీ పరాజయ భారాన్ని ఆయన సైతం మోయలేనట్లుగా అందరికీ అగుపించడంతో వైసీపీ క్యాడర్ అయితే డీ మోరలైజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో రకరకాలైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రాజకీయాల్లో ఏది అయినా జరగవచ్చు. అది అందరికీ తెలిసిందే. పైగా కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిన జగన్ అదే పార్టీ నుంచి వచ్చిన అత్యధిక సంఖ్యలో పార్టీ జనం ఇవన్నీ చూసినపుడు సహజంగానే నిజం అనిపిస్తుంది. అయితే వైసీపీ అధినేత జగన్ వైఖరి తెలిసిన వారు మాత్రం ఆయన ఈ పని చేయరు అని కూడా అంటుంటారు

ఇదిలా ఉంటే వైసీపీ కాంగ్రెస్ లో విలీనం వార్తలు అదే పనిగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాతో రావడంతో వైసీపీ ఎట్టకేలకు రియాక్ట్ కాక తప్పింది కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థల మీద విరుచుకుపడ్డారు.

జగన్ స్వభావం తెలిసిన వారు ఎవరూ వీటిని నమ్మరని ఆయన అన్నారు. జగన్ ని జైలుకు పదహారు నెలలు పంపిస్తేనే ఆయన లొంగలేదు. సోనియాగాంధీనే ఎదిరించి వచ్చిన జగన్ మళ్లీ ఎందుకు ఆ పార్టీతో చేతులు కలుపుతారు అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ కి ఓటమి ఎదురైనంత మాత్రాన తగ్గిపోతాడు అనుకుంటే పొరపాటు అని ఆయన అన్నారు.

జగన్ ఎక్కడికీ పోరని ఆయన తాడేపల్లిలోనే ఉంటారని టీడీపీ కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతారని నాని అన్నారు. 2029లో మళ్లీ సీఎం అయ్యేంతవరకూ జగన్ జనంతోనే ఉంటారని ఎక్కడా ఆగేది లేదని ఆయన స్పష్టం చేశారు.

జగన్ విషయంలో విష ప్రచారం చేస్తున్న వారికి నిరాశే మిగులుతుందని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన దాన్ని జగన్ నిశితంగా గమనిస్తున్నారని, హామీలు తీర్చకపోతే మొదట ప్రశ్నించేది జగనే అని ఆయన అన్నారు. ప్రజలను హింసించినా వైసీపీ క్యాడర్ ని ఇబ్బందులకు గురి చేసినా జగన్ తప్పకుండా అండగా ఉండి పోరాడుతారని ఆయన అన్నారు.

ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్న వారు ఇదంతా గుర్తు పెట్టుకోవాలని కోరారు. జగన్ దాదాపుగా అయిదున్నరేళ్ళ తరువాత బెంగళూరు వెళ్తే ఆయన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం శివకుమార్ తో భేటీ అయ్యారని కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తున్నారని వార్తలు అల్లుతారా అని మండిపడ్డారు. షర్మిలను పార్టీ పదవి నుంచి తీసేయమని జగన్ కండిషన్ పెట్టారని వీరే కధలు అల్లి ప్రచారం చేస్తున్నారు అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News