జనసేనలోకి చేరికలు...సీట్లు ఎక్కువ ఇస్తారా...!?

ఇటీవలనే టీడీపీ యువ నేత నారా లోకేష్ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో 150 సీట్ల పై దాటి పోటీ చేస్తుందని ప్రకటించారు

Update: 2023-12-28 04:03 GMT

ఇటీవలనే టీడీపీ యువ నేత నారా లోకేష్ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో 150 సీట్ల పై దాటి పోటీ చేస్తుందని ప్రకటించారు. అంటే మిత్రులకు పొత్తులో ఆ మిగిలిన సీట్లే ఇస్తామని చెప్పడమే దాని అర్ధం అని అంతా అనుకున్నారు. అయితే జనసేన కనీసంగా యాభై గరిష్టంగా అరవై సీట్లను డిమాండ్ చేస్తోంది అని అంటున్నారు.

అయితే జనసేనకు అంతమంది అభ్యర్ధులు ఎక్కడ నుంచి వస్తారు అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాలతో పాటు టీడీపీలో కూడా చర్చగా ఉందని ప్రచారం సాగింది. మరి ఇదే విషయం మీద జనసేన అంతర్మధనం చెందిందో లేక తన పార్టీని పటిష్టం చేయాలని భావించిదో తెలియదు కానీ ఉన్నట్లుండి జనసేనలో చేరికలు మొదలయ్యాయి.

జనసేనలో అనూహ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ చేరారు. ఆయనకు టికెట్ హామీ లభించింది. మరి ఎక్కడ సర్దుతారు అన్నది తెలియదు. తాను విశాఖ సిటీలో ఎక్కడ నుంచి అయినా పోటీకి రెడీ అని వంశీ చెప్పారు.

గాజువాక, భీమునిపట్నం, పెందుర్తి, ఎలమంచిలి సీట్లు జనసేనకు కన్ ఫర్మ్ అయ్యాయని అంటున్నారు. వీటికి అభ్యర్ధులు కూడా రెడీగా ఉన్నారు. ఇపుడు వంశీ చేరారు. ఆయనకు ఎక్కడ అకామిడేట్ చేస్తారు అంటే విశాఖ తూర్పునే ఎందుకు తీసుకోకూడదు అన్న చర్చ జనసేనలో వస్తోందిట.

వంశీది అదే సొంత సీటు, పైగా ఆయన సామాజికవర్గం బలంగా ఉన్న ప్లేస్ అది. దాంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబుని పక్కన పెట్టి ఆ సీటు కోసం జనసేన డిమాండ్ చేస్తుందని అంటున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఓసీ అభ్యర్ధి వెలగపూడికి ఈసారి రెస్ట్ ఇచ్చి జనసేనకు ఆ సీటు ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్లుగా ఉంటుందని ఆ పార్టీ భావిస్తోందిట.

ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద నాయకుడిగా పేరు పొందిన డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు జనసేనలో చేరారు. ఆదికేశవులు నాయుడుకి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఉండేవి. దాంతో చిత్తూరు జిల్లాలో ఆయన మనవరాలికి సీటు ఇపుడు జనసేన ఇవ్వాల్సి ఉంది. తిరుపతిలో అయితే అభ్యర్థి ఉన్నారు. దాంతో పాటుగా మరో సీటుని తీసుకునే ఆలోచనలో జనసేన ఉంది అంటున్నారు.

ఇంతే కాదు ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన బలం విషయంలో మధింపు చేసేందుకు పవన్ మూడు రోజుల పాటు కాకినాడ పర్యటన పెట్టుకున్నారు. అక్కడ కూడా జనసేన బలాబలాలు చూసుకుని పొత్తులో కోరే లిస్ట్ కి ప్రిపేర్ చేస్తారు అని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి ఈ జిల్లాలలో కొందరు నేతలు పవన్ సమక్షంలో చేరుతారు అని అంటున్నారు

ఇలా చేరిన వారికి టికెట్లు ఇచ్చే బాధ్యతను పవన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక పవన్ పార్టీకి పాతిక సీట్లు కాదు కచ్చితంగా నలభై నుంచి యాభై సీట్లు పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు

ఇక జనసేనలో చేరిన వంశీ రానున్న రోజులలో మరింత మంది వైసీపీ నుంచి జనసేనలో చేరుతారు అని ప్రకటించారు. మరి వారికి కూడా ఉత్తరాంధ్రాలో సీట్లు పొత్తులో భాగంగా జనసేన తీసుకుంటుంది అని అంటున్నారు. సో జనసేన పొత్తు సీట్లు పెంచుకోవడం కోసం కూడా ఈ చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News