పెళ్లి చేసుకునే యువతులకు బంఫర్ ఆఫర్!
ఆ దేశ రాజధాని టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి చేసుకునే యువతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
జపాన్.. పెళ్లి చేసుకోబోయే యువతులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఆ దేశ రాజధాని టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి చేసుకునే యువతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో వృద్ధుల జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంలో జనాభా సంఖ్య పడిపోతోంది. ఉద్యోగం, కెరీర్ అంటూ యువత చాలా లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతో పిల్లల్ని కనేవారి సంఖ్య తగ్గిపోతోంది. అంతేకాకుండా ఒక్క సంతానానికే చాలా మంది దంపతులు పరిమితమవుతున్నారు.
ఈ నేపథ్యంలో జనాభా సంఖ్యను పెంచడానికి జపాన్ ప్రభుత్వం వినూత్న పథకంతో ముందుకొచ్చింది. జపాన్ రాజధాని టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో టోక్యో నుంచి గ్రామాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనే యువతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే (2025) ఆర్థిక సంవత్సరం నుంచి అమలుచేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ పథకం కింద ఒక మహిళ దేశ రాజధాని టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి సంబంధాలను చూసుకోవడానికి అవసరమైన ఖర్చులను జపాన్ ప్రభుత్వం భరిస్తుంది. ఇక ఆ మహిళలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటానికి సిద్ధపడితే మరింత నగదును అందించాలని నిర్ణయించింది.
కాగా ఈ మధ్య కాలంలో దేశ రాజధాని గ్రేటర్ టోక్యోకు భారీ సంఖ్యలో యువతులు విద్యా, ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాల కోసం వలస వచ్చినట్లు జపాన్ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలా వచ్చిన మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే అధికంగా ఉండటం విశేషం.
ఇలా ఉద్యోగాలు, విద్య, ఉపాధి కోసం రాజధాని నగరానికి వస్తున్న మహిళలు టోక్యోలనే ఉండిపోతున్నారు. ఫలితంగా జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ–పురుష నిష్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
జపాన్ లోని మొత్తం 47 ప్రిఫిక్చెర్స్ (రాష్ట్రాలు వంటివి) లో టోక్యోను మినహాయిస్తే.. 46 చోట్ల 15-49 ఏళ్ల మధ్య మహిళల సంఖ్య 91 లక్షలు మాత్రమే ఉంది. అదే ప్రాంతాల్లో పురుషుల సంఖ్య 1.11 కోట్లుగా ఉండటం గమనార్హం. కొన్ని ప్రిఫిక్చెర్స్‌లో స్త్రీ–పురుషుల నిష్పత్తి మధ్య తేడా 30 శాతాన్ని మించిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఈ అంతరాన్ని తగ్గించడానికి నడుం కట్టింది.
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకునే యువతులకు జపాన్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిద్వారా జనాభాను పెంచాలని నిర్ణయించింది. ఫలితంగా స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరాలను తగ్గించవచ్చని భావిస్తోంది.
ప్రస్తుతం జపాన్ లో జనాభా సంతానోత్పత్తి రేటు కేవలం 1.20 శాతంగానే ఉంది. ఇది కనీసం 2.1 శాతం ఉంటేనే జనాభా పెరుగుతుంది. జపాన్ లో గతేడాది అతి తక్కువగా 7,27,277 జననాలు మాత్రమే నమోదు కావడం గమనార్హం.