జయలలిత నగలు వేలం... వివరాలివే!

అవును... జరిమానా చెల్లించేందుకు జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు.

Update: 2024-02-26 06:53 GMT

ఒకానొక సమయంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నగలకు సంబందించిన చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించేది. ఇందులో భాగంగా... ఆమె వద్ద ఊహించని స్థాయిలో బంగారు నగలు ఉన్నాయని, వజ్రాల హారాలు ఉన్నాయి, వందల కిలోల వెండి సామాన్లు ఉన్నాయని చర్చ జరిగితే. అయితే ఆమె మరణానంతరం అందులో ఉన్న వాస్తవాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో జయలలిత నగలను వేలం వేయాలని నిర్ణయించారు. జరిమానా కట్టించుకోవడానికే ఈ పని చేస్తుండటం గమనార్హం.

అవును... జరిమానా చెల్లించేందుకు జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. జయలలితకు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానానూ విదించింది. ఈ నేపథ్యంలో ఆమె మరణానంతరం ఆమె జరిమానాను చెల్లించడానికే ఈ పని చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఆ కేసు ఏమిటి.. ఈ జరిమానా ఎంత మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!

అక్రమాస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం 2014లో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, సుధాకరన్‌, ఇళవరసిలకు తలో నాలుగేళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. దీంతో... ఈ తీర్పుని సవాలు చేస్తూ ఆ నలుగురూ కర్ణాటక హైకోర్టులో అప్పీల్‌ చేశారు.

ఈ సమయంలో వీరి అప్పీల్ ని విచారించిన కర్ణాటక ఉన్నత న్యాయస్థానం.. ఈ నలుగురినీ విడుదల చేస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో డిసెంబరు 5 - 2016న జయలలిత మరణించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 100 కోట్ల జరిమానా తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది.

అయితే ఆమె మరణానంతరం ఇంత భారీ మొత్తంలో ఆమె తరుపున జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమె ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టులో అప్పగించిన 28 కిలోల బంగారం.. 800 కిలోల వెండి.. వజ్రాల నగలను వేలం చేయాలని.. అలా వచ్చిన నగదుతో జరిమానా చెల్లించాలని నిర్ణయించారు.

దీంతో... మార్చి 6, 7 సుప్రీంకోర్టు అండర్ లో ఉన్న జయలలిత నగలను తమిళనాడుకు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. అనంతరం వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచి, వాటి ప్రస్తుత విలువను నిర్ణయించి, వేలం వేయనున్నారు. అయితే... ఈ నగలే సుమారు 40 కోట్ల రూపాయల వరకూ ధర పలకొచ్చాని అంటున్నారు. ఇక మిగిలిన 60 కోట్ల రూపాయలను స్థిరాస్తులను వేలం వేయడం ద్వారా సమకూర్చనున్నారని అంటున్నారు.

Tags:    

Similar News