జేసీ ఫ్యామిలీకి ఎన్ని టిక్కెట్లు...బాబు లెక్క ఏంటో...!?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి రాజకీయ పలుకుబడి ఒకప్పుడు ఒక రేంజిలో ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి 1978 నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి రాజకీయ పలుకుబడి ఒకప్పుడు ఒక రేంజిలో ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి 1978 నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. ఆయన 2019 దాకా అలాగే ప్రత్యక్ష రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన కాంగ్రెస్ లోనే కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కాలేదు కానీ ఆ స్థాయిలో అధికారం అయితే చలాయించారు.
ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక ఇపుడు వారసుల తరం వచ్చింది. జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి అలాగే దివాకరరెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి 2019లో తొలిసారిగా పోటీ చేశారు అస్మిత్ తాడిపత్రిలో పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు. పవన్ అనంతపురం ఎంపీగా బరిలోకి దిగితే చేదు అనుభవం ఎదురైంది.
అయితే ఈసారి గట్టిగా దిగాలని ఈ ఇద్దరు సోదరులూ చూస్తున్నారు. జేసీ అస్మిత్ రెడ్డి అయితే తాడిపత్రిని పట్టుకుని చాలా కాలం నుంచే తిరుగుతున్నారు. అలాగే పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా కంటే అసెంబ్లీకే పోటీకి సుముఖంగా ఉన్నారు. ఆయన గుంతకల్లు నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. జేసీల అల్లుడు అయిన దీపక్ రెడ్డి రాయదుర్గం నుంచి సీటు అడుగుతున్నారు.
ఇలా జేసే ఫ్యామిలీ ప్యాకేజి కింద ఈసారి మూడు సీట్లు అడుగుతున్నారు అంటే ఇది టీడీపీ అధినాయకత్వానికి పెద్ద పరీక్ష అనే అంటున్నారు. జేసీలు అంటేనే సీమలో ఫైర్ బ్రాండ్స్ కింద లెక్క. వారు స్వపక్షాన్ని కూడా ఏమాత్రం ఆలోచించకుండా విమర్శించేయగలరు.
ఇపుడు జేసీ పెద్దలు వారసులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. ఇదే అనంతపురం నుంచి పరిటాల ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కూడా తమకు రెండు టికెట్లు అని డిమాండ్ పెడుతోంది. ఇదే తీరున ఏపీలో చాలా చోట్ల ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు.
ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అన్నదే బాబు విధానంగా ఉంది. కానీ జేసీలు అయితే మాట వింటారా అన్నదే ఇపుడు అతి పెద్ద డౌట్. టికెట్లు ఇవ్వకపోతే ఎన్నికల వేళ బిగ్ సౌండ్ చేసే ప్రమాదం ఉంది. అయితే చంద్రబాబు మాత్రం వారికి ఎలాగోలా నచ్చచెబుతారు అని అంటున్నారు. అయినా సరే జేసీలు తగ్గకపోతే మాత్రం అనంతపురంలో జేసీలే ఈసారి టీడీపీకి అతి పెద్ద స్పీడ్ బ్రేకర్లు అవుతారు అని టాక్ నడుస్తోంది.