ఏఐ తో ఉద్యోగాలు ఉఫ్... కన్ ఫాం అంటున్న ఆల్ట్ మన్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో నూతన అడుగు. అయితే ఈ ఏఐ వల్ల ప్రయోజనాల సంగతి కాసేపు పక్కనపెడితే... నష్టాలు తీవ్రస్థాయిలో ఉండే ఛాన్స్ ఉందని కథనాలొస్తోన్న వేళ... తాజాగా ఈ విషయాలపై దాని సృష్టికర్త స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో నూతన అడుగు. అయితే ఈ ఏఐ వల్ల ప్రయోజనాల సంగతి కాసేపు పక్కనపెడితే... నష్టాలు తీవ్రస్థాయిలో ఉండే ఛాన్స్ ఉందని కథనాలొస్తోన్న వేళ... తాజాగా ఈ విషయాలపై దాని సృష్టికర్త స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా కొత్త సాంకేతిక వచ్చిన తొలినాళ్లలో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు రేకెత్తడం సహజం. ప్రస్తుతం చాట్ జీపీటీ తరహా ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ పైనా అదే తరహా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీ రూపకర్త, ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ ఆల్ట్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మాయం అవుతాయని అంగీకరించారు.
అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతారని కుండబద్ధలు కొట్టారు ఆల్ట్ మన్. కృత్రిమ మేథ కేవలం మనిషికి అనుబంధంగా పనిచేస్తుందని.. ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదంటూ వస్తోన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఉద్యోగాలు కచ్చితంగా ప్రభావితమవుతాయని క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మరిన్ని విషయాలు వెల్లడించిన ఆయన... ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ కన్నా శక్తివంతమైన ఏఐని అభివృద్ధి చేయగల సత్తా ఓపెన్ ఏఐకి ఉందని.. అయితే ఇప్పటికిప్పుడే దాన్ని విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు కూడా అందుకు సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని ఆల్ట్ మన్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో నవంబర్ లో అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ అనూహ్య ఆదరణ సొంతం చేసుకుందని తెలిపిన ఆయన... చాట్ జీపీటీ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా... మానవులపై ఏఐ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని ఆల్ట్ మన్ అభిప్రాయపడ్డారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
కాగా... కృత్రిమ మేధ (ఏఐ) తో చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయని ఇటీవలే అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్ మన్ శాక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ సాంకేతికతలో వస్తున్న కొత్త ఒరవడులు వల్ల సుమారు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో నెంబర్ చెప్పకపోయినా... కచ్చితంగా ప్రభావం ఉంటుందని తాజాగా ఆల్ట్ మన్ కూడా స్పష్టం చేశారు.