పవన్ డిప్యూటీ సీఎం...హోం శాఖ ఆయనదే !

అది కూడా డిప్యూటీ సీఎం హోదాతో. అంటే బాబు సీఎం అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. పైగా అత్యంత కీలకమైన హోం శాఖ ఆయనకు దక్కాలి. ఇదీ జోగయ్య డిమాండ్.

Update: 2024-04-28 08:29 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో అధికార ఆశలు ఎంత మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపు నేతలు మాత్రం చాలా పెద్ద ఆశలు పెట్టుకుంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని వారు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లను మాత్రమే టీడీపీ నుంచి పొత్తులో భాగంగా తీసుకుని పోటీ చేయడంతో ఆ ఆశలు నీరుకారాయి.

దాని మీద కాపు పెద్దలు అయితే మొదట్లో చాలా ఆగ్రహోదగ్రులు అయ్యారు. ఎట్టకేలకు వారు వాస్తవాలను గ్రహించారు. సొంతంగా జనసేన పోటీ చేస్తే అధికారం సంగతి దేముడెరుగు పవన్ సైతం ఎమ్మెల్యేగా గెలవడం కష్టంగా మారుతుందని అర్ధం చేసుకున్నారు. పైగా ఓట్లు చీలి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని కూడా అంచనా వేశారు.

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జనసేన రాజకీయ జీవితం కూడా పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని కూడా భావిస్తున్నారు. దాంతో పవన్ రూటే కరెక్ట్ అని ఇప్పటికి ఒక అవగాహనకు వచ్చారు బలమైన టీడీపీతో పొత్తు ఉంటే ఆ పార్టీని ఒడ్డున పడేయడం తో పాటు జనసేనకు కూడా అధికారం దక్కుతుందని వారు నమ్ముతున్నారు.

అయితే కాపు పెద్దలకు ఇపుడు మరో డౌట్ వస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే జనసేనకు ఇచ్చే పవర్ ఏమిటి అని. ఇదే విషయం మీద ఆ మధ్య దాకా కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య అయితే పవన్ కి సీఎం గా అధికారంలో వాటా రెండున్నరేళ్ళు కోరుతూ వచ్చారు. కానీ జనసేనకి పొత్తులో వచ్చిన సీట్లు చూసిన తరువాత సీఎం అశలు అయితే లేవు అనే అంటున్నారు.

అయితే లేటెస్ట్ గా జోగయ్య కొత్తరకం డిమాండ్ తో ముందుకు వచ్చారు. అదేంటి అంటే ఆయన పవన్ ని హోం మినిస్టర్ గా చూడాలని అనుకుంటున్నారు. అది కూడా డిప్యూటీ సీఎం హోదాతో. అంటే బాబు సీఎం అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. పైగా అత్యంత కీలకమైన హోం శాఖ ఆయనకు దక్కాలి. ఇదీ జోగయ్య డిమాండ్. దీనికి ఆయన జనసేన అధినేతకు ఒక లేఖ రూపంలో రాశారు కూడా.

అది కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పాలని కోరుతున్నారు. ఎన్నికల సభలలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కనుక పవన్ ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని, అలాగే హోం మంత్రిత్వ శాఖతో గౌరవిస్తామని చంద్రబాబు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాలని జోగయ్య కోరుకుంటున్నారు.

అదే జరిగితే కనుక కాపు ఓట్లు అన్నీ గుత్తమొత్తంగా టీడీపీ కూటమి వైపు టర్న్ అవుతాయని ఆయన భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చూస్తే కనుక వైసీపీకి 51 శాతం ఓటు షేర్ వచ్చిందని అందులో బీసీలు 20 శాతం ఎస్సీ ఎస్టీలు 16 శాతం కాపులు ఎనిమిది శాతం, రెడ్లు అయిదు శాతం, ఇతర వర్గాలు రెండు శాతం ఓట్లు వేస్తే ఆ నంబర్ వచ్చిందని జోగయ్య విశ్లేషించారు.

ఇక రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో సాగిన తరువాత కాపుల ఓట్లు వైసీపీకి ఎనిమిది శాతం నుంచి అయిదు శాతానికి తగ్గిపోయిందని ఆయన అంటున్నారు. ఇక 51 శాతం ఓటు షేర్ అప్పట్లో వచ్చినా ఇపుడు అది కాస్తా 46 శాతంగా వైసీపీకి ఉందని కూటమి ఓటు షేర్ 54కి పెరిగిందని అంటున్నారు.

ఈ నేపధ్యంలో కాపుల ఓట్లు కూటమికి టర్న్ కావాలంటే పవన్ కి హోం శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వంలో పవన్ ది నంబర్ టూ ర్యాంక్ ఉండాలని ఆ హామీలు ఎన్నికల ప్రచారంలోనే బాబు ఇస్తూ ప్రకటనలు చేస్తే కనుక కాపులు మొత్తం టర్న్ అవుతారని ఆయన చెబుతున్నారు మరి దీని మీద టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News