ఎగిరిపోయిన చిలుకను రోజులో పట్టేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
అతను ఆస్ట్రేలియా జాతికి చెందిన "గాలా రాక్టో" అనే నాలుగు నెలల వయసున్న చిలుకను రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు.
రోటీన్ కు భిన్నమైన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. పంజరంలో ఉండాల్సిన చిలుక ఎగిరిపోయిన ఉదంతంలో.. దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వారు పక్కా స్కెచ్ వేసుకున్న నేపథ్యంలో.. కేవలం రోజులో దాన్ని పట్టేసిన జూబ్లీహిల్స్ పోలీసుల వ్యవహారం అందరిని ఆకర్షిస్తోంది. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చి.. హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 44లో నివసించే నరేంద్ర ఒక ఖరీదైన కాఫీ షాప్ ను నిర్వహిస్తున్నాడు. అతను ఆస్ట్రేలియా జాతికి చెందిన "గాలా రాక్టో" అనే నాలుగు నెలల వయసున్న చిలుకను రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు. తాజాగా దానికి ఆహారం పెట్టేందుకు పంజరం తలుపు తీసిన క్రమంలో.. అది కాస్తా ఎగిరిపోయింది.
దీంతో.. తన చిలుక ఎగిరిపోయిందని.. వెతికి పెట్టి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నరేంద్ర. ఈ కేసును టేకప్ చేసిన జూబ్లీహిల్స్ ఎస్ఐ ముత్యాల రాకేశ్.. చిలుక ఫోటోను.. స్థానికంగా పక్షులు.. జంతువులు అమ్మే వారికి షేర్ చేసి.. దాని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
ఈ క్రమంలో ఒకరు అందించిన సమాచారంతో ఎగిరి పోయిన చిలుకను 24 గంటల వ్యవధిలోనే పట్టేసుకున్నారు. అదెలానంటే.. ఎగిరిపోయిన చిలుకను ఎర్రగడ్డలోని ఒక వ్యక్తి చేజిక్కించుకొని దాన్ని రూ.30వేలకు ఒకరికి అమ్మారు. అతను.. దాన్ని మరో వ్యక్తికి రూ.50వేలకు అమ్మేశాడు. దాన్ని రూ.70 ధరగా పేర్కొంటూ సయ్యద్ అనే వ్యాపారి తన వాట్సాప్ స్టేటస్ లో ఉంచాడు. దీన్ని చూసిన మరో షాపు యజమాని.. పోలీసులు వెతుకుతున్న చిలుక ఇదే అన్న విషయాన్ని గుర్తించి.. వెంటనే సమాచారాన్ని అందించటంతో వారు వెళ్లి ఆ చిలుకను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. ఈ ఉదంతం మొత్తం గత నెల 24 - 25 తేదీల్లోచోటు చేసుకుంది. 24న చిలుక ఎగిరిపోతే.. 25న సదరు చిలుకను దాని యజమాని అయిన నరేంద్రకు అప్పజెప్పారు. ఈ మొత్తం కేసును పరిష్కరించే విషయంలో అనుసరించిన ప్లానింగ్ ను పలువురు అభినందిస్తున్నారు.