నాడు చీఫ్ విప్.. మంత్రి.. నేడు విప్..జర్నలిస్టు నేత వింత పరిస్థితి!

అందుకే పెద్దలు సైతం రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదని అంటుంటారు.

Update: 2024-11-13 16:30 GMT

రాజకీయాల్లో కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరగదు. అసలు అనుకోని విధంగా జరగడమే రాజకీయాలు అని కూడా అనుకోవాలి. అంతెందుకు..? ఒక పార్టీలో ప్రతిపక్షంలో ఉండగా తీవ్రంగా పోరాడి.. సరిగ్గా ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరడం.. తీరా ఆ అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి ఉదాహరణలు కోకొల్లలు. కాకపోతే.. ఇలాంటివి సహజం అనుకుంటూ ముందుకుసాగితేనే రాజకీయాల్లో రాణించగలుగుతారు. అందుకే పెద్దలు సైతం రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదని అంటుంటారు. పదవులు మనల్ని వెదుక్కుంటూ రావాలే కానీ.. మనం పదవుల కోసం వెంటపడకూడదని కూడా చెబుతుంటారు.

25 ఏళ్ల కిందటే ఎంపీ

ఉమ్మడి ఏపీ ఉన్న సమయంలోనే 25 ఏళ్ల కిందటే అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పనిచేశారు కాల్వ శ్రీనివాసులు. టీడీపీని నమ్ముకుని.. ఈనాడు జర్నలిస్టు ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు ఆయన. కాగా, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన మలి విజయం కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. 1999 లో అనంతపురం ఎంపీగా గెలించిన కాల్వ.. 2004, 2009లో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం 2014లో రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గారు.

చీఫ్ విప్, మంత్రి

2014లో విభజిత ఏపీలో తొలుత చీఫ్ విప్ వంటి కీలక పదవిని నిర్వహించారు కాల్వ శ్రీనివాసులు. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు పదవి దక్కింది. 2019 ఎన్నికల్లో పార్టీ, ఆయన కూడా ఓటమి పాలయ్యారు. కానీ, ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే, బీజేపీతో పొత్తు కారణంగా అనంతపురం జిల్లా నుంచి బీసీ వర్గానికి చెందిన సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. బీసీనే అయిన వాల్మీకి వర్గానికి చెందిన కాల్వకు అవకాశం దక్కలేదు.

విప్ తో న్యాయం

ఎంపీ, చీఫ్ విప్, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కాల్వకు ఇప్పుడు అసెంబ్లీలో విప్ గా అవకాశం దక్కింది. వాస్తవానికి గతంలో నిర్వహించిన పదవులతో పోలిస్తే కాల్వ శ్రీనివాసులుకు ఇది చిన్న పదవే. కానీ, పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోవాల్సిందే. మరోవైపు కాల్వ.. టీడీపీకి కట్టుబడిన నాయకుడు. పదవుల కంటే పార్టీనే ముఖ్యం అనుకునే నిబద్ధత కలిగినవారు. కాబట్టి ఏ పదవి ఇచ్చినా న్యాయం చేయడమే కర్తవ్యంగా భావిస్తారు.

Tags:    

Similar News