తన తల్లి 19వ ఏటే ఏడు సముద్రాలు దాటింది... కమలా హారిస్ భావోద్వేగం!
ఈ నేపథ్యంలో తన తల్లి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి పీక్స్ కి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న కావడంతో ఈ ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో షికాగోలో నాలుగు రోజులపాటు డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కమలా హారీస్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో తన తల్లి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
అవును... షికాగోలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో లో కమలా హారీస్ ప్రసంగించారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి గురించి మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా... "మన జీవిత కథలకు మనమే రచయితలుగా ఉండాలి" అని తన తల్లి చెప్పిన మాట్లే ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని అన్నారు.
ఇదే క్రమంలో... ఈ క్షణం తాను ఎవరికోసమైనా బాధపడుతున్నానంటే అది తన కన్నతల్లి కోసమే అని చెప్పిన కమలా హారీస్... ఆమె పేరే శ్యామలా హారీస్ అని తెలిపారు. వాస్తవానికి ఆమె దూరం అయ్యారనే భావన తనకు ప్రతీరోజూ ఉన్నప్పటికీ... ఈ క్షణంలో ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ బాధగా ఉందని అన్నారు. ఈ సమయంలో ఆమె ఎక్కడున్నా ఈ క్షణంలో ఎంతో సంతోషంతో దీవిస్తుంటారని అన్నారు.
ఈ సందర్భంగా జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, మహిళలకు ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్ ను నయం చేసే శాస్త్రవేత్త కావాలని ఆమె కలలు కనేదని కమలా హారీస్ తన తల్లి గురించి తెలిపారు. ఆ లక్ష్యంతోనే తన 19ఏటే ఏడు సముద్రాలు దాటి భారత్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చిందని.. చదువు పూర్తైన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిందని కానీ.. విధిరాత మరోలా ఉందని వెల్లడించారు.
ఇందులో భాగంగా జమైకాకు చెందిన డోనాల్డ్ హారిస్ తో అమ్మకు పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత అదికాస్తా ప్రేమగా మారి, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని కమల తెలిపారు. ఈ నేపథ్యంలో తనను, చెల్లి మాయను తన తల్లి తమ భవిష్యత్తుపై ఎప్పుడూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ తీర్చిదిద్దిందని అన్నారు. ప్రధానంగా అన్యాయం గురించి ఫిర్యాదు చేయడం కాదు.. చేతనైతే అలా జరగకుండా మీ వంతు కృషి చేయాలని ఆమె తమకు నేర్పిందని వెల్లడించారు.
ఈ విధంగా తన తల్లితో తమ అనుబంధాన్ని కమలా హారీస్ ఈ సందర్భంగా గుర్తు చేస్తుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
కాగా... కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలనే సంగతి తెలిసిందే. ఈమె 1958లో 19 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్ పై పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 1963లో డొనాల్డ్ హారిస్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2009లో క్యాన్సర్ తో బాధపడుతూ శ్యామలా మృతి చెందారు.