వెగటు చేష్టలు: నాటకంలో భాగంగా పందిని దారుణంగా చంపేసి తిన్నారు

ఇదెంతటి వెగటు వ్యవహారం అంటే.. చదువుతున్న కొద్దీ మనిషిలో ఇంత క్రూరం ఏమిటి? అన్న సందేహం రాక మానదు.

Update: 2024-12-04 09:30 GMT

ఇదెంతటి వెగటు వ్యవహారం అంటే.. చదువుతున్న కొద్దీ మనిషిలో ఇంత క్రూరం ఏమిటి? అన్న సందేహం రాక మానదు. తన వినోదం కోసం వెనుకా ముందు చూసుకోకుండా.. అందరి ఎదుట మూగజీవాల్ని దారుణంగా చంపేయటమే కాదు.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించటం కోసం ఒడిశాలోని పౌరాణిక నాటకాలు ప్రదర్శించే వారి కిరాతకాల్ని చూస్తే.. గుండె మండిపోవటమే కాదు.. వారికి కఠిన శిక్షలు విధించాలనిపించకమానదు.

ఒడిశాలోని గంజాం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక పిచ్చ పీక్స్ కు చేరింది. అక్కడ నిర్వహించే పౌరాణిక నాటకాల్ని రక్తి కట్టించేందుకు వీలుగా మూగజీవాల్ని దారుణంగా చంపేస్తున్నారు. అదేమంటే.. నాటకాల్ని చూసే ప్రేక్షకులను మరింత థ్రిల్ కు గురి చేసేందుకని చెప్పటం విశేషం. సంబరాల పేరుతో జరిగే ఈ ఆరాచకం.. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచానికి తెలిసేలా చేసింది.

తాజాగా ‘‘ఓ’’ అనే గ్రామంలో ‘కంజిఒవళా యాత్ర’ జరిగింది. ఈ సందర్భంగా రామాయణం నాటక ప్రదర్శన జరగ్గా.. వాలి.. సుగ్రీవ వేషధారులు వేదికపై రెండు నాగుపాములతో ప్రమాదకరంగా ఆటలు ఆడారు. దీనికి మించిన మరో దారుణం ఏమంటే.. ఒక రాక్షస పాత్రధారి ప్రేక్షకులు చూస్తుండగా బతికి ఉన్న పందిని తలకిందులుగా కట్టి.. అందరూ చూస్తుండగా కత్తితో దాని పొట్ట చీల్చి.. పచ్చి మాంసాన్ని తిన్న వైనం వెగటు పుట్టించే పరిస్థితి.

అంతేనా.. ఇలాంటి అరాచకాలు అక్కడ చాలానే సాగుతుంటాయి. బతికి ఉన్న కోడిని నోటితో కొరికి చంపటం.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. తాజాగా వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు కావటం.. అవి కాస్తా వైరల్ అయి. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై రాష్ట్ర అసెంబ్లీలోనూ పలువురు సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు.. వేదికపై పందిని చంపి తిన్న కళాకారుడు బింబాధరను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మిగిలిన వారిని గుర్తించి.. వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Tags:    

Similar News