విచార‌ణ‌కు రాలేను.. సీబీఐకి క‌విత‌క్క లేఖ‌

బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత మ‌రోసారి త‌న పంతం నెగ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Update: 2024-02-25 19:34 GMT

బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత మ‌రోసారి త‌న పంతం నెగ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించి సీబీఐ త‌న‌కు పంపించిన నోటీసుల‌పై ఆమె విచార‌ణ‌కు రాలేన‌ని నిష్క‌ర్ష‌గా పేర్కొన్నారు. అంతేకాదు.. కేసు సుప్రీంకోర్టులో విచార‌ణ‌లో ఉన్న స‌మ‌యంలో ఎలా పిలుస్తార‌ని సీబీఐని నిల‌దీశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ విధానంలో మాత్ర‌మే అందుబాటులో ఉంటాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అంద‌రూ చెప్పే కార‌ణ‌మే..

కాగా, తాను సీబీఐ విచార‌ణ‌కురాక పోవ‌డానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పిన‌ట్టుగా.. క‌విత కూడా చెప్పుకొచ్చారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయ‌ని, అందుకే రాలేక పోతున్నాన‌ని తెలిపారు. మీరు కోరిన‌ట్టుగా ఈ నెల 26న అస్స‌లు అందుబాటులో ఉండ‌న‌ని ఆమె తేల్చి చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆమె ఈ లేఖ‌లో వ్యాఖ్యానించారు. 2022 డిసెంబరులో అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీషర్(ఐవో) ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని తెలిపారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని తెలిపారు.

``సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారు. దీనిపై స్పష్టత లేదు. నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా అర్ధం కాలేదు. లోక్‌స‌భ ఎన్నికలు సమీపిస్తున్న స‌మ‌యంలో ఇలా చేయ‌డం అనేక సందేహాల‌కు దారితీస్తోంది. బీఆర్ ఎస్ నాయ‌కురాలిగా నాపై ప్ర‌చార బాధ్య‌త‌లు ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్రం వ‌దిలి పెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి నాకు లేదు. ఇలా.. న‌న్ను బ‌ల‌వంతం చేయ‌డం, ఢిల్లీకి పిలవడం.. ఉద్దేశ పూర్వ‌కంగా పార్ల‌మెంటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయ‌డ‌మే`` అని త‌న లేఖ‌లో క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు.

మీ ఆరోప‌ణ‌లు అసంబ‌ద్ధం!

త‌న‌పై సీబీఐ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను అసంబ‌ద్ధ‌మైన‌వి క‌విత పేర్కొన్నారు. ప్ర‌స్తుతం త‌న కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంద‌న్నారు. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో తాను పిటిష‌న్ వేశాన‌ని గుర్తు చేవారు. ఈ పిటిష‌న్ ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. అంతేకాదు.. త‌న‌ను విచార‌ణ‌కు పిలిచేది లేద‌ని సుప్రీంకోర్టులోనే అదనపు సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ఈ హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని క‌విత తెలిపారు.

స‌హ‌క‌రిస్తూనే ఉన్నాను..

కాగా, తాను సీబీఐ విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్నాన‌ని క‌విత త‌న లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. గత ఏడాది మ‌ధ్య‌లో హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి సీబీఐ బృందం వ‌చ్చిన‌ప్పుడు.. సహకరించిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం, సెక్షన్లను మార్చడం సందేహంగా ఉంద‌న్నారు. రానున్న కొన్ని వారాల పాటు పార్ల‌మెంటు ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని ఆమె పేర్కొన్నారు.


Full View
Tags:    

Similar News