కేసీఆర్ సంచలన కామెంట్స్... అనుమానం తోనా...!?
అంతే కాదు, పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్ధితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందా వుండదా అన్న డౌటూ పెట్టారు.
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నల్లపూస అయిపోయారు. దానికి కారణం కూడా ఉంది. ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. దాంతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా సరే ఆయన ఏదో విధంగా అండ తీసుకుని అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
దాన్ని చూసిన వారు విధి ఎంత చిత్రమైనది అని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాల్సిన కేసీఆర్ చివరికి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది కూడా ఎన్నికలు అయిన రెండు నెలలకు. అందుకే ఎంతటి వారు అయినా విధి చేతిలో పావులు అని అనాల్సిందే.
సరే ఎటూ కేసీఆర్ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహాలపై పెద్దాయన గులాబీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇక యధాప్రకారం ఓదార్పు మాటలూ మాట్లాడారు. తెలంగాణా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచికే ఉపయోగించామని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగించామన్నారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని గట్టిగా ఆయన చెప్పారు. ఏ ఒక్కరూ కూడా ఓటమితో నిరాశతో ఉండరాదని, ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేసీఅర్ హిత వచనాలు పలికారు.
ఇక ఈ అపరచాణక్యుడు తొలిసారిగా రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తనదైన జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుందని ఆయన అంచనా కట్టారు. అంతే కాదు, పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్ధితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందా వుండదా అన్న డౌటూ పెట్టారు.
ఒక వేళ ఆ ప్రభుత్వం మనగలగాలీ అంటే అది వారి చేతుల్లోనే వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల బీఆర్ఎస్ ది ప్రతిపక్ష పాత్ర అని దాన్ని దమ్ముగా చేద్దామని ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు.
ఇవన్నీ ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరైనా కలవాలీ అనుకుంటే మాత్రం పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ అనడమే విశేషం. అలాగే మంత్రులను కలసి వినతిపత్రాలు ఇచ్చినా జనం మధ్యలోనే ఇవ్వాలని మరో సలహా ఇచ్చారు.
ఇవన్నీ బీఆర్ ఎస్ మంచి కోసమే అని ఆయన చెబుతున్నారు. ఏ ఉద్దేశ్యంతో సీఎంను కలిసినా క్యారెక్టర్‌ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అంటున్నారు. అందుకే కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని ఆయన హెచ్చరించారు. ఇవన్నీ ఇలా ఉంటే కేసీఆర్ ఎందుకు ఇలా సూచించారు అన్నది ఇపుడు హాట్ టాపిక్.
బీఆర్ ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి వెళ్తారు అన్న ప్రచారం తో జాగ్రత్తపడి ఇలా అన్నారా లేక నిజంగా కాంగ్రెస్ బద్నాం చేస్తోంది అని భావించే అన్నారా అన్నది తెలియడంలేదు. ఏది ఏమైనా కేసీఆర్ ఫక్త్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ హెచ్చరికలు జారీ చేశారు అని అంటున్నారు. అయినా కానీ పోయేవారిని ఎవరు ఆపినా ఆగుతారా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్.