20 ఏళ్లలో అధినేత కుటుంబం లేకుండా తొలిసారి ఆ పార్టీ ఎంపీ లిస్ట్!

ఇక పదేళ్ల తర్వాత విపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ కు ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.

Update: 2024-02-26 14:30 GMT

లోక్ సభ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. కేవలం 10 రోజుల్లో షెడ్యూల్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలు ప్రచారం మోతెక్కిస్తున్నారు. మోదీ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ పరోక్షంగా ప్రచారం చేసేస్తున్నారు. రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారు. పనిలోపనిగా ఇండియా కూటమి తరఫున పొత్తులనూ పట్టాలెక్కిస్తున్నారు. రాష్ట్రాల స్థాయిలో చూస్తే ఏపీలో అధికార వైసీపీ మరోసారి ఒంటరిగానే సిద్ధం అంటోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పొత్తును మరింత బలోపేతం చేస్తూ తొలిజాబితాను విడుదల చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ తప్పదనిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ పరిస్థితి రావాల్సింది. కానీ, బీజేపీ చేజేతులా వెనక్కుపోయి.. కాంగ్రెస్ ను ముందుకు తోసింది. పరోక్షంగా అధికారాన్ని బీఆర్ఎస్ చేజారకుండా చూద్దామని ప్రయత్నించిందనే ఆరోపణలను మిగుల్చుకుంది. ఇక పదేళ్ల తర్వాత విపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ కు ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఇదీ చరిత్ర..

బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2004లో లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంది. నాడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్.. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి యూపీఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ 2006లో రాజీనామా చేసి మరీ గెలిచి తెలంగాణ వాదాన్ని నిలబెట్టారు. ఇక 2009 ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుకు మారారు. అక్కడ విజయం సాధించి.. పాలమూరు ఎంపీ హోదాలోనే తెలంగాణను తెచ్చి చరిత్రలో నిలిచిపోయారు. ఇక 2009లోనే కరీంనగర్ లో తన సమీప బంధువు వినోద్ కుమార్ ను నిలబెట్టారు. కానీ, ఆయన పరాజయం పాలయ్యారు. మరోవైపు 2014లో తెలంగాణ ఖరారయ్యాక జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసి గెలిచారు. 2019లో మాత్రం కవిత ఓటమిని మూటగట్టుకున్నారు. కరీంనగర్ లో 2014లో గెలిచిన వినోద్ కుమార్ 2018లో మాత్రం బండి సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014లో కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించినా.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఎంపీగా రాజీనామా చేశారు.

ఇదీ జరగబోయేది..

20 ఏళ్లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్నిసార్లూ కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఒక్కరైనా పోటీచేశారు. ఇప్పుడు మాత్రం త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో దీనికి పూర్తి భిన్నంగా ఉండనుంది. తొలిసారిగా కేసీఆర్ కుటుంబ సభ్యులు లేకుండానే బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. ఆ జాబితాను పరిశీలిస్తే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, జహీరాబాద్ లో బీబీ పాటిల్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, కరీంనగర్ లో వినోద్ కుమార్, మల్కాజిగిరిలో సీహెచ్ భద్రారెడ్డి, మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి లేదా చిలుముల మదన్ రెడ్డి, ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్, నల్లగొండలో గుత్తా అమిత్ రెడ్డి లేదా తేరా చిన్నప్పరెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, గుత్తా అమిత్ రెడ్డిలలో ఒకరు, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లేదా బాల్క సుమన్, నాగర్ కర్నూల్ నుంచి పి.రాములు, మహబూబాబాద్ లో సీతారాం నాయక్ లేదా రెడ్యానాయక్, మాలోత్ కవిత, వరంగల్ నుంచి పి.దయాకర్ లేదా కడియం కావ్య లేదా ఆరూరి రమేశ్, లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ లలో ఒకరికి ఎంపీ టికెట్లు దక్కనున్నాయి. అంటే.. కేసీఆర్ గానీ, ఆయన కుమార్తె కవిత (నిజామాబాద్), కుమారుడు కేటీఆర్ (మల్కాజ్ గిరి)లలో ఎవరూ లోక్ సభ బరిలో ఉండరని తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ వచ్చాక కేసీఆర్ కుటుంబ సభ్యులు లేని తొలి లోక్ సభ ఎన్నిక ఇదే అవుతుంది.

Tags:    

Similar News