కోనసీమలో చీరల పంపిణీ.. విసిరి కొట్టిన మహిళలు!
ఆ పార్టీ నేతలు పంచిన చీరలు తీసుకున్న మహిళలు అక్కడికక్కడే అవి తమకు వద్దని విసిరికొట్టారు. సుమారు 300 మంది మహిళలు ఇలా చేయడంతో సదరు పార్టీ నాయకులు ఖంగుతిన్నారు.
రాజకీయ చైతన్యం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమలో తాజాగా సంచలన ఘటన వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన దరిమిలా.. నాయకులు ఇచ్చే రూకల కోసం.. చాలా చోట్ల ఓటర్లు ఎదురు చూశారు. అదేవిధంగా తాయిలాల కోసం కూడా వేచి ఉన్నారు. కానీ, చిత్రంగా కోనసీమలోని ఆలమూరు మండలంలో మాత్రం జనాలు అన్నింటికీ అతీతంగా తమక నచ్చిన నేతకు ఓటేస్తామని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. ఇక్కడి ప్రజలు సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత.. ఆదివారం తెల్లవారుజామున ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెబుతున్న ఓ పార్టీకి చెందిన నాయకులు.. ఆలమూరు మండలంలో ఇళ్లకు వెళ్లి చీరలు పంపిణీ చేయడం సంచలనంగా మారింది. సహజంగా జనాలు కూడా.. ఏదిస్తే అది తీసేసుకుంటున్న పరిస్థితులు ఉన్నా.. ఇక్కడ మాత్రం ఆ పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది.
ఆ పార్టీ నేతలు పంచిన చీరలు తీసుకున్న మహిళలు అక్కడికక్కడే అవి తమకు వద్దని విసిరికొట్టారు. సుమారు 300 మంది మహిళలు ఇలా చేయడంతో సదరు పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. చీరలను పంచిన నేతల మొహం ముందే వాటిని విసిరి కొట్టడంతో కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. అయితే.. గ్రామస్తులు అందరూ ఏకంకావడంతో సదరు నాయకులు తిరుగు పయనమయ్యారు.
ఇక, ఏ పార్టీ నేతలు వచ్చి ఏమిచ్చినా తీసుకోకూడదని ఇక్కడి మహిళలు తీర్మానం చేయడం గమనార్హం. నిజానికి ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు.. ప్రచారం ఆపివేస్తారు. అయితే.. ఆ రోజు కేవలం డబ్బులు తాయిలాలు పంచేందుకు ఇచ్చిన రోజుగా ఇప్పటికీ కొందరు భావిస్తుండడం గమనార్హం. దీనిపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ఇదిలావుంటే.. ఆలమూరు మండలం తాజా ఎన్నికల్లో ఆదర్శంగా నిలవడం విశేషం.