ఏపీలో రాష్ట్రపతి పాలన.. బాబు కోసం మోడీని కోరిన నిర్మాత!
అవును... చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు
చంద్రబాబు అరెస్ట్ పై స్పందించేందుకు ఇండస్ట్రీ జనాలు అనాసక్తితో ఉన్నారన్ని, అందుకు ఎవరూ స్పందించడం లేదని, ఖండించడం లేదని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ వంటి వారు స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిర్మాత కేఏస్ రామారావు... ఎవరూ ఊహించలేదు అన్న రేంజ్ లో స్పందించారు. మోడీకి లేఖ రాశారు.
అవును... చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇందులో భాగంగా... మీకు తెలియకుండానే చంద్రబాబును జగన్ మోహన్ రెడ్డి అరెస్టు చేయించారా అని ప్రశ్నించడం గమనార్హం.
ఇక రామారావు ఈ లేఖలో స్పందిస్తూ.... "మీరు జీ-20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్ లో ఉన్నప్పుడు ఈ అరెస్టు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాం లు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు... ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరఫున బాధతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది" అని పేర్కొన్నారు
అనంతరం... "నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు కానీ... రాష్ట్ర పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయాను. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు మీరూ వచ్చారు. తర్వాత... 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక నేరాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన మొదలుపెట్టారు". అని అన్నారు.
ఇదే సమయంలో... "మీరు శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో అలా చేయొద్దని జగన్ ను హెచ్చరించాల్సింది. దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే.. ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను ఆయన అరెస్టు వార్త కుదిపేసింది. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధానిగా మీరు గమనించి ఉండాలి." అని సూచించారు.
"నేషనల్ ఫ్రంట్ కు ఎన్టీఆర్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే తెలుగు ప్రజల హృదయాలు రగులుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి. ప్రధానమంత్రిగా మీకున్న అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దుచేయండి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండి" అని కేఎస్ రామారావు తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం అటు ఇండస్ట్రీ జనాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఆ లేఖ చర్చనీయాంశం అవుతుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి అనే స్థాయిలో ఒక సినిమా నిర్మాత లేఖ రాయడం ఆసక్తిగా మారింది.