ఈ విడ్డూరం కన్నారా? కేటీఆరూ.. ‘సారూ..’ ఒకే వేదికపై..
తెలంగాణ రాజకీయాల్లో ‘సార్’ అంటే ప్రొఫెసర్ జయశంకరే.. యువకుడిగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఆయన వయోధికుడు అయినా పట్టు సడలించలేదు.
తెలంగాణ రాజకీయాల్లో ‘సార్’ అంటే ప్రొఫెసర్ జయశంకరే.. యువకుడిగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఆయన వయోధికుడు అయినా పట్టు సడలించలేదు. తన ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అలుపెరగకుండా శ్రమించిన ఆయనను తెలంగాణ వాదులంతా ‘సార్’ అని పిలిచేవారు. స్వతహాగానే ప్రొఫెసర్ అయిన జయశంకర్ సార్ అనే పదానికి నిజమైన నిదర్శనంగా ఉండేవారు. అయితే, తెలంగాణను చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ స్థానంలో తెలంగాణ ఉద్యమంలోకి మరో సార్ వచ్చి చేరారు.
సారూ.. కారు.. 16.. సాధ్యం కాలేదు
ప్రొఫెసర్ జయశంకర్ మరణించిన మూడేళ్లకు తెలంగాణ సాకారమై.. ఎన్నికల్లో గెలిచి.. బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదటి టర్మ్ లో మంచి పాలన అందించడంతో రెండో విడతలోనూ గెలిపించారు. అయితే, రెండోసారి సీఎం అయ్యాక వచ్చిన లోక్ సభ ఎన్నికల నాటికి కేసీఆర్ ‘సార్’ అయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ ను మరిపించే ఉద్దేశమో ఏమో కానీ.. సారు.. కారు.. 16 అంటూ తెలంగాణలోని 17 ఎంపీ నియోజకవర్గాలకు గాను 16 గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే, 9కి మాత్రమే పరిమితం అయ్యారు. కేసీఆర్ ను ‘సారు’గా మాత్రం ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఆ సారు కాదు.. ఈ సారు..
వాస్తవానికి ప్రొఫెసర్ జయశంకర్ తరహాలోనే అచ్చమైన తెలంగాణవాది ప్రొఫెసర్ కోదండరాం. ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి.. వైఎస్ మరణానంతరం మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేయడం ఎలాగని కేసీఆర్ ఆలోచన చేస్తున్న సమయంలో కోదండరాం ను తెర మీదకు తెచ్చారు. కోదండ ఆధ్వర్యంలోనే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసి ముందుకుసాగారు. బీజేపీ మినహా అన్ని పార్టీలనూ ఈ వేదికలోకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించారు. ఆ సమయంలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కంటే కోదండరాంకే మంచి పేరు వచ్చింది. అయితే, 2014లో ఎన్నికల ముందు కోదండరాం కాంగ్రెస్ నాయకులను కలిశారన్న కోపంతో కేసీఆర్ ఆయనను పదేళ్లు దూరం పెట్టారు. ఓ దశలో కోదండరాంను వ్యక్తిగతంగానూ దూషించారు. ఈ విధంగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో రెండో సారుగా కీలక పాత్ర పోషించిన నాయకుడిని అవమానించారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు?
తెలంగాణ సాకారమై.. పదేళ్లు కేసీఆర్ పాలన ముగిసి గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడింది. ఆ వెంటనే కోదండరాంను ఎమ్మెల్సీగా చేశారు. కారణాల వల్ల ఆలస్యమైనా.. ఇటీవల కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. అయితే, తాజాగా కోదండరాం.. కేసీఆర్ కుమారుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒకే కార్యక్రమంలో కలుసుకున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ సందర్బంగా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటో వైరల్ అవుతోంది.