పల్లా జోరుకు కేటీఆర్ బ్రేక్!

తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్.. పార్టీలోని అసంత్రుప్తి, అసమ్మతిపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

Update: 2023-09-09 15:30 GMT

జనగామ టికెట్ తనకే ఖాయమని నమ్మకంతో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జోరుకు బ్రేక్ పడిందా? పల్లా వేగానికి కేటీఆర్ కళ్లెం వేశారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఒక్క ఫోన్ కాల్ తో జనగామలో సమావేశం కోసం వెళ్తున్న పల్లాను కేటీఆర్ వెనక్కి రప్పించడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా జనగామ టికెట్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వకముందే పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి విశ్వాసానికి పోవడం మంచిది కాదని బీఆర్ఎస్ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.

జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి తనకే టికెట్ దక్కుతుందనే ఆశతో ఆయన ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం పల్లా రాజేశ్వర్ రెడ్డికే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

దీంతో టికెట్ కోసం ముత్తిరెడ్డి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఇందులో జనగామ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ తనకే ఖాయమైందని భావనతో పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారు మీదున్నారనే టాక్ ఉంది.

తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్.. పార్టీలోని అసంత్రుప్తి, అసమ్మతిపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ముందుగా ఆయన జనగామపై ద్రుష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో తన వర్గం నాయకులతో పల్లా సమావేశం ఏర్పాటు చేశారు. దీని కోసం హైదరాబాద్ నుంచి బయల్దేరారని తెలిసింది.

కానీ ఈ సమావేశం గురించి తెలుసుకున్న కేటీఆర్ వెంటనే పల్లాకు ఫోన్ చేసి మధ్యలో నుంచే వెనక్కి రప్పించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కేసీఆర్తో సమావేశం కారణంగానే పల్లా రాలేదని ఆయన వర్గం అనుచరులు చెబుతున్నారు. కానీ ఏది ఏమైనా అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని పల్లాకు కేటీఆర్ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News