రేవంత్‌, ఆ ముఖ్య నేత‌కు మ‌ధ్య పుల్ల‌లు పెడుతున్న కేటీఆర్‌!

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ బ‌రిలో దిగ‌నున్న కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండలాల కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

Update: 2023-11-01 02:45 GMT

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇటీవ‌లి కాలంలో ఊహించ‌ని రీతిలో బ‌ల‌ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి స‌వాలే విసురుతోంది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై కామారెడ్డి తామంటే తాము పోటీ చేస్తామంటూ ముఖ్య నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. తాను కాక‌పోతే సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అయినా బ‌రిలో దిగుతారంటూ ఇటీవ‌లే రేవంత్ ప్ర‌క‌టించారు. అయితే, ఇలా కాంగ్రెస్ ముఖ్య నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలో వారిలో వానికే లుక‌లుక‌లు పుట్టేలా బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కామెంట్లు చేశారు.

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ బ‌రిలో దిగ‌నున్న కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండలాల కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని కేటీఆర్ వెల్ల‌డించారు. కేసీఆర్ కామారెడ్డి ని ఎంచుకోవడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టమని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజల దశలు మార్చేందుకు కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడన్నారు. కామారెడ్డి కి కేసీఆర్ వస్తుండడంతో ప్రతిపక్షాలు భూములు గుంజుకోవడానికి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములు అమ్ముకోవద్దు. కామారెడ్డి కేసీఆర్ వస్తే చుట్టూ పక్కల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుంది.' అని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు మన బిడ్డ అనుకుంటూ ఆదరిస్తున్నారన్నారు.

కామారెడ్డిలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు పోటీగా బ‌రిలో ఉండ‌బోయే నేత‌ల గురించి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు ఇతర పార్టీల నేత‌లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారన్నారు. 'రాష్ట్రం మొత్తం కామారెడ్డి నియోజకవర్గం వైపు చూస్తుంది. నవంబర్ 9న సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. కామారెడ్డి దెబ్బ, సత్తా రేవంత్ రెడ్డికి చూపించాలి. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా? కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాం. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కంటే షబ్బీర్ అలీ నయం. ' అంటూ కాంగ్రెస్ నేత‌ల‌కే అంత‌ర్గ‌తంగా పంచాయ‌తీ పెట్టేలా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News