ట్ర‌బుల్ షూట‌ర్ కేటీఆర్‌... ఆ ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌ట్లే

అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లు కేటీఆర్ ట్ర‌బుల్ షూట‌ర్ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను సందేహంలో ప‌డేస్తున్నాయి.

Update: 2023-10-01 01:30 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ రాబోయే కాలంలో ఆ పార్టీకి కాబోయే నాయ‌కుడు అనేది ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా జ‌ర‌గ‌బోయేది త‌థ్యం అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఏర్పాటు చేసి త‌న ప‌రోక్షంలో బాధ్య‌త‌ల‌న్నీ చూసుకుంటార‌ని ప్ర‌క‌టించినా... కీల‌క‌మైన మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టినా.... ఇవ‌న్నీ కేటీఆర్‌ను రాబోయే కాలానికి కాబోయే ర‌థ‌సార‌థి అనే విష‌యం చాటిచెప్పేందుకే. అయితే, త‌న మేన‌ల్లుడు, పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు పొందిన‌ హ‌రీశ్ రావు అంత‌టి స‌మ‌ర్థుడు కేటీఆర్ అవునా అనే విష‌యంలో గులాబీ ద‌ళ‌ప‌తికి ప‌లు సందేహాలు ఉన్నాయి. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లు కేటీఆర్ ట్ర‌బుల్ షూట‌ర్ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను సందేహంలో ప‌డేస్తున్నాయి.

త్వ‌ర‌లో జ‌ర‌గబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున పోరాడే అభ్య‌ర్థులు వీరేనంటూ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ విడుద‌ల చేసిన జాబితాపై ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్తి వ్య‌క్త‌మైంది. దీని విష‌యంలో ఒకింత త‌ర్జ‌న భ‌ర్జ‌న త‌ర్వాత కీల‌క‌మైన జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించ‌బోయే వారితో కేటీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు పిలిపించి వారి అభిప్రాయాలు విని... స‌మ‌స్య‌లు ముగిసిపోయాయ‌ని వ్య‌క్తం చేశారు. అభ్య‌ర్థుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన నేత‌లు సైతం వెన‌క‌డుగు వేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, అవేవీ స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. పైగా షాకిచ్చేలా ప‌రిస్థితులు మారిపోయాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి టికెట్ దక్కకపోవడం ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయనను మంత్రి కేటీఆర్ పిలిపించుకుని మాట్లాడారు. ఎన్నికల తర్వాత కేబినెట్ హోదా కలిగిన పదవి ఇస్తానని కసిరెడ్డికి కేటీఆర్ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయినా వెనక్కు తగ్గని కసిరెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. మ‌రోవైపు ఇంకో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఎదురైంది.

గ‌త కొద్దికాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని కీల‌క‌మైన స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌, జ‌న‌గామ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ సిటింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య త‌న‌ను కాద‌ని మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రికి టికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల హ‌ర్ట‌య్యారు. ఆయ‌న్నూ, క‌డియం పిలిచి మాట్లాడిన కేటీఆర్ వివాదం స‌మ‌సిపోయింద‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చారు. అయితే, ఆ మ‌రుస‌టి రోజే క‌డియంకు తాను మ‌ద్ద‌తివ్వ‌బోన‌ని రాజ‌య్య ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు తాను అంగీక‌రించ‌లేద‌ని సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి చెప్తున్నారు. ఈయ‌న్ను డీల్ చేసింది సైతం కేటీఆర్ అన్న‌ది గ‌మ‌నార్హం. మొత్తంగా కేటీఆర్ చేత డీల్ చేయ‌బ‌డ్డ ఇద్ద‌రు సిటింగ్ ఎమ్మెల్యేలు మ‌రో ఎమ్మెల్సీ ఇప్పుడు పార్టీకి ఏకుమేకుగా మార‌డం, అది కేటీఆర్ ఖాతాలో ప‌డుతుండ‌టంతో....ఆయ‌న ట్ర‌బుల్ షూట‌ర్ నైపుణ్యంపై చ‌ర్చ‌ను రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News