తెలంగాణలో 'రజాకార్' ... పొలిటికల్ వార్!
కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎదురు దాడి చేశారు.
తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలకు ముందు.. సహజంగానే రాజకీయం గరంగరంగా ఉండగా.. తాజాగా రజాకార్ సినిమా టీజర్ మరింతగా ఈ పాలిటిక్స్‌లో సెగ పుట్టించింది. సెప్టెంబర్ 17వ తేదీ(తెలంగాణలో నిజాం పాలన అంతమైన రోజు) సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రజాకార్ సినిమా టీజర్ ను సినిమా బృందం విడుదల చేసింది.
అయితే, ఈ టీజర్‌పై రాజకీయ దుమారం రేగింది. ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షం బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీజర్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించగా, కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎదురు దాడి చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..''రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించటానికి బీజేపీకి చెందిన కొంతమంది కుహనా మేధావులు, దివాలా తీసిన జోకర్లు తమ శాయశక్తుల కృషి చేశారు. తెలంగాణ శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డు తో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకువెళతాం'' అని ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు.
ట్రాక్ మార్చారు: బండి ఎటాక్ అయితే, కేటీఆర్ చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ''తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని మొదటి వాగ్దానం చేసిన వారు ఇప్పుడు ట్రాక్ మార్చి తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతున్నారు. రజాకర్ల వాస్తవాలను చూపించినప్పుడు ట్విట్టర్ టిల్లు(కేటీఆర్)కు ప్రాబ్లంగా ఉంది.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. వినాయక చవితి రోజు శుభాకాంక్షలు చెప్పకుండా రజాకర్ల హిందూ మారణ హోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నాదు చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు ట్విట్టర్ టిల్లు కు కొంత స్పృహ కలిగించమని అందరం గణేశుని ప్రార్థిద్దాం'' అని వ్యాఖ్యానించారు.