అమెరికాలో టెక్ జాబ్స్ పెద్ద ఎత్తున కట్!
కారణం ఏదైనా, పరిస్థితులు మరేవైనా.. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి.
కారణం ఏదైనా, పరిస్థితులు మరేవైనా.. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని.. పెద్దఎత్తున నియామకాలతో మళ్లీ ఐటీ రంగం కళకళలాడుతుందని ఆశిస్తున్నా ఆ కల నిజం కావడం లేదు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత ఉండొచ్చని చెబుతున్నారు. రెండో నెలలోనే పరిస్థితి దారుణంగా మారిందని అంటున్నారు.
అవును... గత ఏడాదిలో యూఎస్ లో ఐటీ కంపెనీలు సుమారు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు చెబుతుండగా... ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటికే సుమారు 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. ఇలా తమ తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థల్లో స్టార్టప్ లు, బడా కంపెనీలు అనే తారతమ్యాలేమీ లేవు.
ఇందులో భాగంగా... ఫ్రంట్ డస్క్ అనే యూఎస్ స్టార్టప్ ఇటీవల సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించగా... స్నాప్ ఇంక్ అనే సంస్థ తన ఉద్యోగుల్లో సుమారు 540 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఓక్తా ఇంక్ అనే మరొక సంస్థ సైతం సుమారు 400 మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. వీటితోపాటు ఐటీ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, యూనిటీ సాఫ్ట్ వేర్.. మొదలైన సంస్థలు కూడా ఇదే పనిలో ఉన్నాయని అంటున్నారు.
పరిస్థితి ఇంత దారుణంగా పడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయని అంటున్నారు నిపుణులు. వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో సైతం నియామకాలు జరిగినప్పటికీ... తర్వాత ఆ పరిస్థితులు మారడంతో పాటు అనుకోని విధంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో లెక్క తప్పింది! ప్రధానంగా... అధిక వడ్డీరేట్లు, ఆర్థిక సమస్యలు వివిధ రంగాలను ఇబ్బంది పెడుతుండడంతో అవి ఐటీ ప్రాజెక్టులకు కేటాయించే బడ్జెట్లు తగ్గిస్తున్నాయి.
దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు సరికదా.. ఉన్నవారికీ వేతనాలు సర్దుబాటు చేయడం కూడా ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఐటీ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. దీన్ని అందిపుచ్చుకోని పక్షంలో వెనుకబడిపోతామని ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఐ వైపు మళ్లిస్తున్నాయని అంటున్నారు.
భారత్ లో ప్రస్తుత పరిస్థితి!:
ప్రపంచ దేశాలు, ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు భారత్ లోనూ ఈ విషయంలో సమస్యలు దాదాపుగా ఒకేలా ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా కొత్త నియామకాలు జరగడం లేదు సరికదా.. ఉన్నవారికే ఉద్యోగాలు పోతున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ క్రమంలో వలో రాంట్, స్విగ్గీ, సేల్స్ ఫోర్స్ వంటి మొదలైన సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగాలు తొలగించినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా.. వలోరాంట్ అనే గేమ్ డెవలప్మెంట్ కంపెనీ సుమారు 500 మందికి పైగా ఉద్యోగులను తీసివేయగా... కాల్ సెంటర్, టెక్, కార్పొరేట్ విభాగాలకు చెందిన 400 మంది ఉద్యోగులను స్విగ్గీ తొలగించింది. ఇదే సమయంలో మన దేశంతో పాటు వివిధ దేశాల్లో 70,000 మంది ఉద్యోగులు ఉన్న సేల్స్ ఫోర్స్ సంస్థ 10 శాతం ఉద్యోగులను తీసివేయనున్నట్లు వెల్లడించింది