బూతులు మాట్లాడను.. రజినీలా అబద్ధాలు చెప్పను : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫైర్

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.;

Update: 2025-03-24 07:33 GMT

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రజినీపై ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఆమె ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను బూతులు మాట్లాడనని, మాజీ మంత్రి విడదల రజినీలా అబద్ధాలు చెప్పనని చెప్పారు.

తాను మాజీ మంత్రి రజిని కాల్ డేటా తీసుకున్నానని ఆరోపిస్తున్నారని ఎంపీ తప్పుపట్టారు. తమ ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారని, తమవాళ్ళకు ఓ న్యాయం, బయటివారికి మరో న్యాయం ఉండదని స్పష్టం చేశారు. 40 సంవత్సరాలుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నామని, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని ఇంతవరకు అడగలేదన్నారు. అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని, తమ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.

2009లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేలం వేస్తే నిబంధనల ప్రకారం ఆ వేలంలో పాల్గొని అధిక ధర చెల్లించి భూమిని కొనుగోలు చేశామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. వేలానికి, కేటాయింపులకు మధ్య చాలా తేడా ఉందని గుర్తు చేశారు. ఇదంతా మాజీ రజినీతో ఎవరు మాట్లాడించారో తనకు బాగా తెలుసునని అన్నారు.ఒకరిని విమర్శించే ముందు వివరాలు తెలుసుకోవాలని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలవుతారని ధ్వజమెత్తారు. విడదల రజిని మాదిరిగా అబద్ధాలు చెప్పలేనన్నారు. రెడ్‌ బుక్‌లో రాసుకున్న విధంగా కేసులు నమోదు చేయిస్తున్నారన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఐపీఎస్ అధికారి జాషువా సర్వీసు 2040 వరకు ఉందని, జాషువా స్టేట్‌మెంట్‌లో లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్స్‌కు.. తనకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారన్నారు. 2021 ఆగస్టు 24న రజినీ నుంచి ఫిర్యాదు వచ్చిందని, లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్స్‌లో అక్రమాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారన్నారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్‌ మాధవరెడ్డిని రజినీ తీసుకువెళ్లారని, ఐపీఎస్ ఆఫీసర్ పీ.జాషువాను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. మైన్స్ విభాగం అధికాకులు భారీ ఫైన్ వేశారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. అక్రమాలు చేసి.. మళ్లీ రెడ్‌ బుక్‌ అంటూ బుకాయించడం కరెక్టు కాదని మండిపడ్డారు. అధికారులను బెదిరించి డబ్బులు లాక్కున్నారని మాజీ మంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయని ఎంపీ తెలిపారు. పోతారం భాషా, ఎంపీపీ శంకర్ రావు, ముత్తా వాసు, గోల్డ్ శ్రీను, మున్నంగి, అబ్బాస్ ఖాన్, నాగయ్య, ఇలా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని రజనీ తిరిగి చెల్లించలేదని ఎంపీ ఆరోపించారు. పది రోజుల క్రితం ఒక మధ్యవర్తిని తన దగ్గరికి పంపించి కేసును ఆపమని రాయబారం నడిపిన మాట నిజం కాదా? అని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఆ స్టోన్ క్రషర్స్‌కు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన మాట నిజం కాదా..? తప్పులు చేసి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా అని ఎంపీ నిలదీశారు. మాజీ మంత్రి రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని.. అందుకే తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని అన్నారు. తనకు బూతులు చేతకావని, రజినీ మాదిరిగా అబద్ధాలు చెప్పలేనని అన్నారు.

Tags:    

Similar News