గ్యాంగ్‌స్ట‌ర్ (X) స్టార్ హీరో : జైలు కోర్టు ఖ‌ర్చులకే కోట్లు గంగ‌లో

గ్యాంగ్‌స్ట‌ర్ వ‌ర్సెస్ స‌ల్మాన్! ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. జైలు, కోర్టు ఖ‌ర్చుల కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారనేది మీకు తెలుసా?

Update: 2024-10-20 09:56 GMT

గ్యాంగ్‌స్ట‌ర్ వ‌ర్సెస్ స‌ల్మాన్! ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. జైలు, కోర్టు ఖ‌ర్చుల కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారనేది మీకు తెలుసా? స‌ల్మాన్ ఖాన్, గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ వైరం గొడ‌వ‌ల నేప‌థ్యంలో.. జైలు, కోర్టుల పేరుతో ఆ కుటుంబాలు అన్ లిమిటెడ్ గా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారనేది ముంబై మీడియా చెబుతున్న మాట‌.

ముఖ్యంగా స‌ల్మాన్ ఖాన్ త‌న సెక్యూరిటీ కోసం వ్య‌క్తిగ‌తంగా కోట్లు ఖ‌ర్చు చేస్తుంటే, అత‌డి భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వం ల‌క్ష‌ల్లో వెచ్చిస్తోంది. మ‌రోవైపు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ జైల్లో బాగా ఉండ‌టం కోసం అత‌డి కుటుంబం ఏడాదికి 40ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోంద‌ని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు వై ప్లస్ భద్రత కల్పించారు. ఇటీవ‌ల అతడి భద్రతను ఒక లేయర్ పెంచారు. సల్మాన్‌ఖాన్‌ భద్రత కోసం ప్రభుత్వం ప్రతినెలా ఎంత ఖర్చు పెడుతోంది, ఏటా ఎంత ఖర్చు పెడుతోంది? అనే లెక్కలు చూస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. నిజానికి Y ప్లస్ భద్రత అంటే సల్మాన్ ఖాన్ చుట్టూ దాదాపు 25 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. ఇందులో దాదాపు 2 నుంచి 4 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు భద్రతా సిబ్బందిని క‌లుపుకుని దాదాపు 25 మంది భద్రతా సిబ్బంది రెండు షిఫ్టులలో పని చేస్తారు. ఈ భద్రతా బృందానికి 2 నుండి 3 వాహనాలు ఉన్నాయి. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఉంది.

దీనిని బ‌ట్టి స‌ల్మాన్ భ‌ద్ర‌త‌కు ఖ‌ర్చు ఎంతో నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం Y ప్లస్ సెక్యూరిటీ ఖర్చు ప్రతి నెలా దాదాపు 12 లక్షలు. అంటే మొత్తం ఏడాదికి దాదాపు 1.5 కోట్లు ఖ‌ర్చు చేస్తారు. పోలీసు అధికారుల ప్రకారం ఏ Y ప్లస్ భద్రతా బృందంతో ఎంత మంది వ్యక్తులు ఉన్నారు అనే సమాచారాన్ని భద్రతా కోణం నుండి స్పష్టంగా చెప్ప‌డం కుద‌ర‌దు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ... ఇటీవ‌ల‌ సల్మాన్ ఖాన్ భద్రతపై ఖర్చు కోట్లలో ఉంది. వై ప్లస్ భద్రత, ముంబై పోలీసు సిబ్బంది, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుల మోహరింపు, సల్మాన్ భద్రతపై వార్షిక వ్యయం మొత్తం 3 కోట్లకు చేరుకుంటోందని స‌మాచారం. అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు ఎదురై.. అతడి ఇంటిపై కాల్పులు జరిగినప్పటి నుండి ముంబై పోలీసులు అతని భద్రతను పెంచారు. ముంబై పోలీసు సిబ్బంది కూడా ఆయన ఇంటి దగ్గర సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. అయితే సల్మాన్ ఖాన్ సన్నిహితుడిగా భావించే బాబా సిద్ధిఖీ హత్యకు గురై లారెన్స్ గ్యాంగ్ హస్తం ఉందని భావిస్తున్నప్పటి నుంచి అత‌డి భద్రతపై ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

గ్యాంగ్‌స్ట‌ర్ కోసం 40ల‌క్ష‌ల ఖ‌ర్చు:

పంజాబీ గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ జమీందార్ కుటుంబం .. జైలులో ఉన్న అత‌డిని చూసుకోవడానికి సంవత్సరానికి రూ. 40 లక్షలు ఖర్చు చేస్తుందని క‌జిన్ ఒక‌రు చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని ఫజిల్కా గ్రామంలో జన్మించారు. అతడి అసలు పేరు `బాల్కరన్ బ్రార్`. లారెన్స్ పేరు అంత‌కంటే బావుంద‌ని భావించిన అతడి అత్త సూచన మేరకు పేరు మార్చారు. ఫాజిల్కా గ్రామస్తులు లారెన్స్‌ను ఎప్పుడూ తగాదాలు ఎరుగ‌ని మంచి ప్రవర్తన కలిగిన కుర్రాడుగానే గుర్తుంచుకున్నారు. కానీ అతడు నేర ప్రపంచంలోకి ప్రవేశించడానికి కీలకమైన కారణాలలో ఒకటి అత‌డు గ్రామం నుండి నిష్క్రమించడం.

జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను బాగా చూసుకోవడానికి అతడి కుటుంబం సంవత్సరానికి 35-40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుందని అతడి బంధువు వెల్ల‌డించిన‌ట్టు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. బిష్ణోయ్, 31 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌గా జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అత‌డిపై 80 కి పైగా క్రిమినల్ కేసులు న‌మోద‌వ్వ‌గా, ప్ర‌స్తుతం సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు. లారెన్స్ కుటుంబ సభ్యుడు రమేష్ బిష్ణోయ్ మాట్లాడుతూ... 31 ఏళ్ల పంజాబ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ భవిష్యత్తులో నేరస్థుడు అవుతాడని కుటుంబం ఎప్పుడూ అనుకోలేదని, చిన్నతనంలో అతడు ఎల్లప్పుడూ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయిగా ఉన్నాడని చెప్పాడు. అత్యంత భయంకరమైన గ్లోబల్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడిగా త‌మ కుర్రాడు మారుతాడ‌ని పంజాబీ గ్రామం ఊహించ‌లేద‌ట‌. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌నం ప్ర‌కారం.. ``బిష్ణోయ్ కుటుంబం ఎల్లప్పుడూ సంపన్నమైనది. లారెన్స్ తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్. గ్రామంలో 110 ఎకరాల భూమిని కలిగి ఉన్నారు. లారెన్స్ ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడు. ఇప్పుడు కూడా జైలులో అతని కోసం కుటుంబం సంవత్సరానికి రూ. 35-40 లక్షలు ఖర్చు చేస్తుంది`` అని రమేష్ బిష్ణోయ్ తెలిపారు.

స్ట‌డీస్ కోసం లారెన్స్ అబోహర్‌లోని ఒక క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ అయిన అజంప్షన్ కాన్వెంట్ స్కూల్‌కు వెళ్లాడు. తర్వాత అతడు మెట్రిక్యులేషన్ కోసం DAV చండీగఢ్‌లో చేరాడు. హిందూ ప‌త్రిక క‌థ‌నం ప్రకారం.. DAV కళాశాలలో బిష్ణోయ్ అథ్లెటిక్స్ పై మ‌క్కువ‌ పెంచుకున్నాడు. 1,500 మీటర్ల రేసులో పాల్గొనడం ప్రారంభించాడు. మహారాష్ట్ర నాయకుడు బాబా సిద్ధిఖ్ హత్య.. కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో ముడిపడి ఉన్న `కెనడియన్ రాయల్ మౌంటెడ్ పోలీస్ నివేదిక` కారణంగా లారెన్స్ బిష్ణోయ్ ఒక వారం మొత్తం జాతీయ మీడియాలో ముఖ్యాంశాలలో ఉన్నారు. అంతకుముందు మే 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్యలోను అతడి పేరు కూడా బయటపడింది.

Tags:    

Similar News