సంచలనం... లారెన్స్ బిష్ణోయ్ టాప్ హిట్ లిస్ట్ లో ఐదు పేర్లు!

ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ వ్యవహారాలపై పోలీసులు పూర్తి దృష్టి సారించారని అంటున్నారు.

Update: 2024-10-15 03:58 GMT

ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖ్ హత్య నేపథ్యంలో... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై అధికారులు తీవ్ర పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా ఈ హత్య తమ ఖాతాలో వేసుకోవడంతో.. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ వ్యవహారాలపై పోలీసులు పూర్తి దృష్టి సారించారని అంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న కొద్దీ.. లారెన్స్ బిష్ణోయ్ ను ప్రశ్నించే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ.) నుంచి ప్రత్యేక వివరాలు పొందినట్లు జాతీయ మీడియా వెళ్లడించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ తన హిట్ లిస్ట్ లోని టాప్ టార్గెట్ లను ఎన్.ఐ.ఏ.కి వెల్లడించినట్లు చెబుతున్నారు.

అవును... మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖ్ హత్య అనంతరం లారెన్స్ బిష్ణోయ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిద్ధిఖ్ తో పాటు ఆయన కుమారుడిని కూడా చంపమని తమకు ఆదేశాలు అందాయని కస్టడీలో ఉన్న నిందితులు చెప్పారని కథనాలు వస్తుండటంతో.. ఇంకా ఈ హిట్ లిస్ట్ లో ఉన్నదెవరనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దగ్గర ఐదుగురు పేర్లు హిట్ లిస్ట్ లో టాప్ టార్గెట్ గా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వారు ఎవరెవరనేది ఇప్పుడు చూద్దామ్..!!

సల్మాన్ ఖాన్:

1998లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవలని బిష్ణోయ్ కోరుకుంటున్నాడని అంటున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన లక్ష్యంగా ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముంబైలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ దాడికి ప్రయత్నించింది! అయితే... ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

షగన్ ప్రీత్ సింగ్:

సల్మాన్ ఖాన్ తర్వాత లారెన్స్ బిష్ణోయ్ జాబితాలోని తదుపరి లక్ష్యం హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా మేనేజర్ షగన్ ప్రీత్ సింగ్ అని అంటున్నారు. 2021 ఆగస్టులో మొహాలీలో తన సన్నిహిత సహచరుడు విక్కీ మిద్దుఖేరా హంతకులకు షగన్ ప్రీత్ ఆశ్రయం కల్పించాడని బిష్ణోయ్ నమ్ముతున్నాడని చెబుతున్నారు.

మన్ దీప్ ధరివాల్:

విక్కీ మిద్దుఖేరా హంతకులకు సహాయం చేశాడనే ఆరోపణలు పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ గౌరవ్ పడియాల్ సహాయకుడు మన్ దీప్ ధరివాల్ పై ఉన్నాయి. దీంతో... ఇతడు బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడని అంటారు. కాగా... దావీందర్ బాంబిహా గ్యాంగ్ కు గౌరవ్ పాడియాలా చీఫ్ గా ఉన్నాడు. ఇప్పుడు పారారీలో ఉన్నాడు!

కౌశల్ చౌదరి:

దావీందర్ బాంబిహా గ్యాంగ్ తో అనుబంధం ఉన్న కౌశల్ చౌదరికి కూడా విక్కీ మిద్దుఖేరా హత్యకు సంబంధం ఉందని బిష్ణోయ్ భావిస్తున్నారు. విక్కీ మిద్దుఖేరా హంతకులకు ఆయుధాలు సరఫరా చేసింది చౌదరే అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో... చౌదరిని ఎలాగైనా తొలగించాలనేది బిష్ణోయ్ బలమైన కోరికగా చెబుతుంటారు.

అమిత్ దాగర్:

ముద్దుఖేరా హత్యలో అమిత్ దాగర్ కు సంబంధం ఉందని బిష్ణోయ్ గ్యాంగ్ నమ్ముతుంది. ఇతడు కౌశల్ చౌదరికి సన్నిహితుడు. దీంతో... లారెన్స్ బిష్ణోయ్ టాప్ హిట్ లిస్ట్ లో అమిత్ దాగర్ కూడా చిక్కుకున్నాడని చెబుతున్నారు! ఇతడు ఏడు హత్యలు, డజనుకుపైగా దోపీడీ కేసులను అంగీకరించి జైలులో ఉన్నాడు.

Tags:    

Similar News