పోరా బాబూ పో... జగన్ మారని తీరు ?

వైసీపీలో ఏమి జరుగుతోంది. అసలు వైసీపీ తీరు ఎలా సాగుతోంది ఇది పార్టీలో ఉన్న వారిలో అంతర్మధనం సాగుతోంది.

Update: 2024-10-15 07:30 GMT

వైసీపీలో ఏమి జరుగుతోంది. అసలు వైసీపీ తీరు ఎలా సాగుతోంది ఇది పార్టీలో ఉన్న వారిలో అంతర్మధనం సాగుతోంది. ఒక రాజకీయ పార్టీ అన్నాక జనాలూ ఆదరించాలి. పార్టీ జనాలూ విశ్వాసం ప్రకటించాలి. పైగా పార్టీకి గ్లామర్ తో పాటు గ్రామర్ కూడా ఉండాలి

వైసీపీ తీరు చూస్తే ఏకశిలా సదృశ్యంగానే ఉంటూ వస్తోంది. తొలి రోజులలో అది బాగానే ఉన్న రాను రానూ అదే ఇబ్బందిగా మారుతోంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ అధినాయకత్వాన్నే అల్లుకుని ఉంటాయి. కానీ ఆ అల్లుకున్న తీగలు కూడా బలంగా ఉండాలి. అవి బలహీన పడితే ఎంతటి ఫేస్ వాల్యూ ఉన్న వారికైనా కష్టసాధ్యం అవుతుంది అని చరిత్ర నిరూపించింది.

వైసీపీలో సర్వం సహా జగనే. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేవు. అందులో ఎలాంటి వివాదమూ లేదు. జగన్ అనే ప్రజాకర్షణ కలిగిన నాయకుడి చుట్టూనే పార్టీ తిరుగుతోంది. ఆయన గ్లామరే పార్టీకి ఊపిరి. అయితే అదే సమయంలో జగన్ పార్టీకి గ్రామర్ కూడా కావాలి కదా. అది తెచ్చేదే పార్టీ యంత్రాంగం. ఆ యంత్రాంగంలో నేతలు క్యాడర్ ఉంటారు.

పార్టీలో నేతలు ఇపుడు తలో దిక్కూ చూస్తున్నారు. పార్టీ ఓడిన తరువాత వారికి పాత తప్పులు గుర్తుకు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం నాటి ముచ్చట్లు తెచ్చి పార్టీ ఆనాడు అన్యాయం చేసింది కాబట్టి ఈనాడు రాజీనామా అని ఓడిన తరువాత చల్లగా చెబుతున్నారు.

సరే వారు ఎలా చెప్పినా పార్టీ వారిని దగ్గరకు తీయడంలో లేక వారి సమస్యలను ఇబ్బందులను తెలుసుకుని బుజ్జగించడమో చేయాలి కదా అన్న మాట ఉంది. నాయకులకు ఆప్షన్లు బోలెడు ఉంటాయి. వారికి ఇది కాకపోతే మరోకటి. అలాగే పార్టీకి కూడా అవకాశాలు ఉంటాయి.

ఒకరు పోతే మరొకరు అన్న థియరీ ఉండనే ఉంది. కానీ అలా ఒకరు ఇద్దరు పోతే ఓకే. కానీ అదే పనిగా నేతలు అంతా క్యూ కడుతూంటే అపుడు ఏమి జరుగుతుంది. పార్టీ మీద జనాలలో వేరే సంకేతాలు వెళ్తాయి.న్ పార్టీలో ఉన్న నాయకులలో నైతిక స్థైర్యం దెబ్బ తింటుంది. అపుడు టోటల్ గా పై నుంచి దిగువ దాకా సంక్షోభం ఏర్పడుతుంది.

వైసీపీలో గోదావరి జిల్లాలలో దాదాపుగా అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఒకరి వెంట ఒకరు రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి నేతల విషయంలో అధినాయకత్వం తన వంతు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు

ఇక ఇతర జిల్లాలలో కూడా నాయకులు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీకి జనాదరణ ఉంది అని అధినాయకత్వం నమ్ముతోంది. కానీ ఆ విశ్వాసం నేతలలో లేదా అన్న అనుమానం కలుగుతోంది. అంటే అధినాయకత్వం ఆలోచనలకు నేతలకు మధ్య ఎక్కడో గ్యాప్ అయితే ఏర్పడింది అని అంటున్నారు. దానిని సవరించే ప్రయత్నం జరగాలని పార్టీ హితైషులు కోరుకుంటున్నారు.

పెద్ద నాయకులు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు వైసీపీని వదిలేసినా అధినాయకత్వం లైట్ తీసుకుంది అన్న ప్రచారమూ ఉంది. కొత్త నేతలు వస్తారు జనం నుంచి వస్తారు అని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అది మంచిదే కానీ ఉన్న వారిని పోయేలా చేసుకోవడం ఎందుకు కొత్త వారి కోసం చూడడం ఎందుకు అన్నదే చర్చగా ఉంది.

రేపు వచ్చిన వారు కూడా ఉంటారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంటుంది కదా అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ విషయంలో ఇంకా దిద్దుబాట్లు చాలా జరగాలని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పార్టీ అతి తక్కువ టైం లోనే కీలకమైన యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి దానికి వైసీపీ సిద్ధపడేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలంటే తగిన కసరత్తు పై నుంచే మొదలెట్టాలని అంటున్నారు.

Tags:    

Similar News