కేసీఆర్‌ బాటలోనే మజ్లిస్‌ కూడా!

కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతలు తప్పుకుని తమ వారసులకు సీట్లు ఇవ్వాలని అసదుద్దీన్‌ ఓవైసీని కోరుతున్నట్టు తెలుస్తోంది.

Update: 2023-09-11 11:01 GMT

వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల నేతలు తమ వారసులను బరిలోకి దించుతున్నారు. కొందరు నేతలు తాము పోటీ చేయడంతోపాటు తమ పిల్లలకు టికెట్లు కావాలని అడుగుతున్నారు. మరికొందరు తమకు బదులుగా తమ కుమారులు లేదా కుమార్తెలకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ట్రెండ్‌ అన్ని ప్రధాన పార్టీల్లోనూ కొనసాగుతోంది.

ఇక ఇప్పుడు ఈ కోవలో తెలంగాణలో మజ్లిజ్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ (మజ్లిస్‌) పార్టీ కూడా చేరింది. అసదుద్దీన్‌ ఓవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏడు సీట్లలో గెలుస్తోంది. ఈ ఏడూ కూడా హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలోనివే. ముస్లింలు అధికంగా ఉన్నచోట మాత్రమే మజ్లిస్‌ విజయాలు సాధిస్తూ వస్తోంది.

కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతలు తప్పుకుని తమ వారసులకు సీట్లు ఇవ్వాలని అసదుద్దీన్‌ ఓవైసీని కోరుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత ఓవైసీ కూడా పార్టీని యువరక్తంతో నింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయాలంటే అది యువ ఎమ్మెల్యేల వల్లే అవుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సిట్టింగ్‌ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలను వయోభారం కారణంగా తప్పించనున్నారని తెలుస్తోంది. అలాగే మరో స్థానంలో సైతం రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థి మార్పు జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో వారసులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం లభించగా, అందులో అప్పటి యాకుత్‌ పురా ఎమ్మెల్యే అభ్యర్థిని చార్మినార్‌ కు, చార్మినార్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని యాకుత్‌ పురా స్థానాలకు మార్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీ సీనియర్‌ నేతల వారసుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తమ్ముడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ల కుమారులు కూడా ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం బాగా జరుగుతోంది.

మరోవైపు ఇప్పటికే చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, యాకుత్‌ పురా ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రిలు వయోభారం దృష్ట్యా పోటీపై పెద్దగా అసక్తి కనబర్చడం లేదని చెబుతున్నారు. అయితే వారికున్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా అసదుద్దీన్‌ మాత్రం మరో పర్యాయం వారి సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు టాక్‌. ముంతాజ్‌ ఖాన్‌ మాత్రం తన కుమారుడికి అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది.

ఇక చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, మలక్‌ పేట నుంచి అహ్మద్‌ బలాల, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మోయినుద్దీన్‌లు పోటీలో ఉండటం ఖాయమే. నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ అభ్యర్థిత్వం మార్పు జరిగితే ఆ స్థానంలో మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ను బరిలో దింపొచ్చని చెబుతున్నారు. బహదూర్‌ పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ ను అధిక వయసు రీత్యా తప్పిస్తే అక్కడ అక్బరుద్దీన్‌ కుమారుడు నూరుద్దీన్‌ ఒవైసీ పేరు పరిశీలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ మోజంఖాన్‌ బరిలో ఉంటే నూరుద్దీన్‌ ఒవైసీని చార్మినార్‌ లేదా యాకుత్‌ పురా నుంచి పోటీలోకి ఉండొచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News