కర్నూల్ కు హైకోర్టు బెంచ్ ఇవ్వాల్సిందే !

విభజన ఏపీలో రాజధాని అమరావతిలో ఫిక్స్ అయింది. అది కోస్తా మధ్యభాగంలో ఉంది.

Update: 2024-08-08 03:50 GMT

విభజన ఏపీలో రాజధాని అమరావతిలో ఫిక్స్ అయింది. అది కోస్తా మధ్యభాగంలో ఉంది. ఉత్తరాంధ్ర కు ఏమిస్తారు అంటే వారేమీ అడగరు కాబట్టి సరిపోతుంది. కానీ రాయలసీమ వాసులు ఊరుకోరు కదా. వారు అసలే కర్నూల్ ని రాజధానిగా 1953లో ఇచ్చి రెండేళ్ళు తిరగకుండానే వెనక్కి తీసుకున్నారు అన్న ఆవేదనలో ఉన్నారు.

1956లో ఆంధ్ర రాష్ట్రం ఆనాటి తెలంగాణాలో విలీనం అయింది. హైదరాబాద్ అందరి రాజధాని అయింది. మళ్లీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది 2014లో. అలా చూసుకుంటే పూర్వం మాదిరిగా కర్నూల్ రాజధానిగా ఉండాలి కదా అన్నది రాయలసీమ వాసుల వాదన. ఇది తర్కానికి అందే వాదనగానే చూస్తున్నారు.

అయితే దీని మీద శ్రీక్రిష్ణ కమిషన్ కానీ శివరామ క్రిష్ణన్ కమిషన్ కానీ ఇంకా ఇతర నివేదికలు మేధావుల సూచనలు ఏమి చెప్పాయీ అంటే రాజధాని కోస్తాకు ఇస్తే హైకోర్టును రాయలసీమకు ఇవ్వడం సముచితమని. ఇక 1935 ప్రాంతంలో మద్రాస్ లో జరిగిన శ్రీభాగ్ ఒప్పందంలోనూ ఇదే ఉందని రాయలసీమ ఉద్యమ కార్లు గుర్తు చేస్తూంటారు.

అయితే విభజన తరువాత రాజధానితో పాటు హైకోర్టు కూడా అమరావతిలోనే ఉంటుందన్నది కూడా ఫిక్స్ అయిపోయింది. మరి రాయలసీమకు ఏమిటి అంటే ఏమీ లేదు అన్నది ఈ రోజుకీ వస్తున్న జవాబు. దాంతోనే మెల్లగా వారిలో అసంతృప్తి రాజుకుంటోంది.

తాజాగా ఒక డిమాండ్ అయితే వస్తోంది. హైకోర్టు బెంచ్ అయినా ఇవ్వాలీ అని. ఇది కూడా ఎంతో కొంత సముచితమైన డిమాండ్ గానే చూస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి న్యాయవాదుల దీర్ఘకాలిక కోరికను సాకారం చేయాలని కర్నూలు బార్‌ అసోసియేషన న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ని కలసి వారు తమ డిమాండ్ ని ఆయన ముందు పెట్టారు. ఈ మేరకు న్యాయవాదులు టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా మూడు వేల మంది న్యాయవాదులు ఉన్నారని వారు పేర్కొన్నారు.

అయితే స్థానికంగా కోర్టులలో వారికి సరైన సరిపడా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అందువల్ల కర్నూల్ లో నూతన బార్‌ అసోసియేషన కార్యాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. అదే విధంగా కర్నూల్ కి హైకోర్టు బెంచ్ ఇస్తే న్యాయపరంగా కూడా రాయలసీమకు బాగుంటుందని వారు అంటున్నారు.

అయితే ఇది మెల్లగా వచ్చిన డిమాండ్. ఏపీలో ఇంకా కొత్త సర్కార్ కుదురుకోలేదు. అమరావతి మీద దృష్టి పెడుతోంది. ప్రయారిటీస్ కూడా అక్కడే ఉన్నాయి. దాంతో రానున్న రోజులలో ఈ డిమాండ్ కాస్తా అలాగే ఉంటుందా లేక హైకోర్టునే పెట్టమని అడుగుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా అమరావతి రాజధాని విషయంలో ఏపీలోని మూడు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేవు.

కానీ అన్నీ అక్కడే అని సెంట్రలైజేషన్ పాలసీస్ అమలు చేయాలనుకుంటే మాత్రం రీజనల్ గా డిమాండ్లు కొత్తగా వస్తాయి. ఈ రోజుకు మౌనంగా ఉన్న ఉత్తరాంధ్ర కూడా తమ వైపు నుంచి డిమాండ్లూ పెట్టవచ్చు. అందువల్ల కూటమి ప్రభుత్వం సమగ్రమైన అభివృద్ధిని సమానంగా అన్ని ప్రాంతాలకు అందించడం లోనే దృష్టి పెట్టాలని అంటున్నారు.

Tags:    

Similar News