పోతూ.. పోతూ.. రాళ్లు.. పార్టీలకు సవాళ్లు!
విజయవాడ నుంచి రెండు దఫాలుగా ఎంపీగా ఉన్న కేశినేని నాని తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ను కలుసుకున్నారు.
తాజాగా ఏపీలో ఇద్దరు ఎంపీలు తమ తమ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అయితే.. పార్టీలను వీడి పోతున్నవారు.. పోతూ .. పోతూ.. ఆయా పార్టీలపై బలమైన రాళ్లే రువ్వారు. సామాజిక వర్గం-ఆర్థికం-అసమానతలు-అవమానాలు.. ఇలా తమ చేతికి, నోటికి అందివచ్చిన అన్ని అంశాలను ఆయుధాలుగా మార్చుకుని ఆయా పార్టీలపై విసిరి బయటకు వచ్చారు. దీంతో ఎన్నికలకు ముంగిట ఆయా వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి.
నాని రువ్విన రాళ్లు..
విజయవాడ నుంచి రెండు దఫాలుగా ఎంపీగా ఉన్న కేశినేని నాని తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ను కలుసుకున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇది ఆమోదం పొందగానే వైసీపీ తీర్థం పుచ్చుకుంటానన్నారు. అయితే.. ఈ సందర్భంగా నాని.. టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
+ నా కుటుంబానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటే కమ్మ వర్గానికి ఇస్తున్న వేరే నియోజకవర్గం ఇవ్వొచ్చు కదా!
+ కమ్మల్లో వాడుకునేవారిని వాడుకుంటారు.. తొక్కేసేవారిని తొక్కేస్తారు.
+ అమరావతి ఓ కల.. అది నిజం కావడం కల్లే.
+ ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి వాటిని వదిలేసి ఏముందని అమరావతికి వస్తారు.
+ జగన్ సంక్షేమ సారథి, దూరదృష్టి ఉన్న యువ నాయకుడు.
+ చంద్రబాబు అవసరం ఏపీకి లేదు. ఆయన రెస్టు తీసుకుంటే బెటర్
+ వాడుకుని వదిలేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య
+ నన్ను బాగా రుద్దిరుద్ది.. వాడుకుని వదిలేశారు.
+ టీడీపీ వల్ల రూ.2000 కోట్ల నష్టపోయా
---కట్ చేస్తే.. ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
కుమార్ గారి కుస్తీ..!
కర్నూలు ఎంపీగా ఉన్న వైసీపీ నాయకుడు.. సంజీవకుమార్ కూడా ఉరుములు మెరుపులు లేకుండానే ఎలాంటి అంచనాలు రాకుండానే పార్టీకి గుడ్‌బైచెప్పారు. ఆయన తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఆయన కూడా పోతూ పోతూ.. విమర్శల రాళ్లు దట్టంగానే దువ్వేశారు.
+ వైసీపీ నన్ను మోసం చేసింది.
+ బీసీలకు వైసీపీలో విలువ లేదు. ఆటవస్తువులుగా చూస్తారు
+ నన్ను వాడుకున్నారు. నాకు విలువ ఇవ్వలేదు.
+ నన్ను అభివృద్ధి చేయకుండా పార్టీ నేతలే అడ్డు పడ్డారు.
+ నేను డాక్టర్‌ని. నాకు కనీస గౌరవం లేదు.
+ నియోజవర్గం అభివృద్ధి చేయాలన్న నా విజన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.
--- కట్ చేస్తే.. ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్నికలకు ముందు పార్టీలపై ప్రభావం చూపించేవే కావడం గమనార్హం.