లిక్కర్ షాపులకు అప్లై చేయొద్దు.. బాబు.. పవన్ తెలిసిందా?
కొందరు ఎమ్మెల్యేలు నేరుగా వార్నింగ్ లు ఇచ్చేస్తుంటే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా తమకు ముఖ్యనేతలుగా ఉండే వారి చేత బెదిరింపుల దిగుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది.
ఏపీ వ్యాప్తంగా లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోవద్దంటూ ఏపీ అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు హుకుం జారీ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ప్రభుత్వం అనుసరించిన లిక్కర్ పాలసీకి భిన్నంగా.. అంతకు ముందు అనుసరించిన విధానాన్ని ఫాలో కావాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు తేల్చటం తెలిసిందే. అయితే.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం వెలుగు చూస్తోంది.
తమ నియోజకవర్గం పరిధిలోని మద్యం వ్యాపారులకు వార్నింగ్ లు ఇవ్వటమే కాదు.. హుకుం జారీ చేసినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ సిండికేట్ లోకి వేలు పెట్టొద్దన్నట్లుగా వారి తీరు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు లిక్కర్ టెండర్ల జోలికి వెళ్లొద్దని అంటుంటే.. మరికొందరు ఎమ్మెల్యేలు మరో రోత పనికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. వీరి వాదన ప్రకారం.. తమ పరిధిలోని లిక్కర్ టెండర్లలో పాల్గొనే వారు ఎవరైనా సరే.. తమకు వాటాలు ఇవ్వాలని.. తాము పెట్టుబడిగా పైసా పెట్టేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కొందరు ఎమ్మెల్యేలు నేరుగా వార్నింగ్ లు ఇచ్చేస్తుంటే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా తమకు ముఖ్యనేతలుగా ఉండే వారి చేత బెదిరింపుల దిగుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది. తమను కాదని లిక్కర్ టెండర్లలో దరఖాస్తులు చేసతే మాత్రం.. వారు వ్యాపారాలు చేయలేరని.. ఎలా యాపారాలు చేస్తారో తాము కూడా చూస్తామన్న మాటను సీరియస్ గా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ తీరు కూటమి ప్రభుత్వానికి డ్యామేజింగ్ గా మారిందంటున్నారు.
కూటమిలోని కొందరు ఎమ్మెల్యేల ధోరణి కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేస్తున్న పరిస్థితి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఫోకస్ చేయాలంటున్నారు. ఏపీ వ్యాప్తంగా 961 మద్యం దుకాణాలకు ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ కూడా ఇప్పటివరకు రాకపోవటం వెనుక అసలు కారణం ఇదేనని చెబుతున్నారు. ఇలాంటి వాటిల్లో తిరుపతి జిల్లానే ముందు ఉందంటున్నారు. ఇక్కడ 133 మద్యం షాపులకు సంబందించి ఒక్కటంటే ఒక్క అప్లికేషన్లు రాలేదంటున్నారు.
ఇదే కోవలోకి నెల్లూరులో 84 షాపులు.. కాకినాడ జిల్లాలో 58, ప్రకాశంలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 60, విశాఖజిల్లాలో 60 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవటం లో మర్మమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ అంశంపై చంద్రబాబు.. పవన్ లు వెంటనే కలుగజేసుకోవాలని లేదంటూ.. కూటమి ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో వ్యతిరేకత పెరగటమే కాదు.. ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు చంద్రబాబు.. పవన్ లకు ఈ విషయాలు తెలియకుండా ఉంటుందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.