ఎన్నికల కమీషన్ నిర్ణయం వెనక మతలబేంటి ?

ఈసీ ప్రకటించిన పోలింగ్ సమయాలు అనుకూలంగా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

Update: 2024-04-18 15:30 GMT

తెలంగాణ పార్లమెంట్, ఏపీ పార్లమెంట్, శాసనసభ ఎన్నికల ఓటింగ్ సమయం విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. వేసవి కాలం నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునే విధంగా వ్యవహారించాల్సిన ఈసీ దానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసీ ప్రకటించిన పోలింగ్ సమయాలు అనుకూలంగా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ లో తెలంగాణలో అన్ని లోక్ సభ స్థానాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సమయంగా నిర్ణయించారు. వేసవి నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిపితే ఓటింగ్ శాతం పెరిగేదని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వికాస్ రాజ్ నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ సమయం 5 గంటల వరకు పరిమితం చేసిందన్న వాదన వినిపిస్తున్నది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అరకు లోక్ సభ పరిధిలో పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 5 వరకు, పార్వతీపురంలో సాయంత్రం 6 వరకు, అరకు వ్యాలీ, రామచంద్రాపురం, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. ఒకే నియోజకవర్గంలో మూడు రకాల పోలింగ్ సమయం గందరగోళానికి తెరలేపుతున్నాయి. ఇక ఏపీలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుండడం గమనార్హం. ఒకే రోజు పోలింగ్ జరగనున్న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈసీ పోలింగ్ సమయాలను భిన్నంగా ప్రకటించడమే ఈ గందరగోళానికి కారణం.

నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలలో ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, కేవలం ఏపీ, తెలంగాణలలో భిన్నంగా ఉండడం అనుమానాలకు తావిస్తున్నది.

Tags:    

Similar News