‘పోలింగ్ డే’ను దెబ్బేయనున్న లాంగ్ వీకెండ్?
2018 ఎన్నికలతో పోలిస్తే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలతో పోలిస్తే.. పట్టణం.. నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరుగుదల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
గత ఎన్నికలతో పోలిస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై రెండు వారాలకు పైనే జరిగినా.. రాజకీయ వేడి అంతగా రాజుకున్నది లేదు. దీనికి కారణం.. అధికార పార్టీ మినహా మిగిలిన రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని డిసైడ్ చేయకపోవటమే. అధికార బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్.. బీజేపీలు రెండు తమ అభ్యర్థుల జాబితాలో తొలి భాగాన్ని విడుదల చేసినా.. అందులో కీలక స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఫైనల్ చేయలేదు.
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్.. బీజేపీలు దాదాపు డెబ్భై వరకు స్థానాల్ని ప్రకటించాల్సి ఉంది. దీంతో.. అభ్యర్థులు ఎవరో ఫైనల్ కాక కిందా మీదా పడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ డేకు సంబంధించిన ఒక కొత్త చర్చ రాజకీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది. నవంబరు 30న పోలింగ్ డే. రోజుల్లో చూస్తే గురువారం వచ్చింది. పోలింగ్ రోజున పబ్లిక్ హాలీడే కావటం...శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే.. ఎంచక్కా లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చన్న మాట వినిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ప్రాంతాలు.. అందునా హైదరాబాద్ మహానగరం లాంటి చోట్ల లాంగ్ వీకెండ్ ఎఫెక్టు ఎక్కువగా ఉండే వీలుందంటున్నారు. ఓటర్లలో నిరాకస్తత.. రాజకీయాల్ని తాము ప్రభావితం చేయలేమన్న ఫీలింగ్.. రాజకీయాలంటే వెగటు.. ఇలాంటి భావనలు ఓటు వేసేందుకు క్యూలో నిలుచునే కన్నా.. ఆ టైంలో ఎంచక్కా ఎక్కడికైనా బయటకు ప్లాన్ చేయటం పైనే కొన్ని వర్గాలు ఫోకస్ చేస్తుంటాయి.
ఈసారి లాంగ్ వీకెండ్ లో వస్తున్న పోలింగ్ డే.. పోలింగ్ మీద ప్రభావాన్ని చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2018 ఎన్నికలతో పోలిస్తే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలతో పోలిస్తే.. పట్టణం.. నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరుగుదల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి వేళ.. పట్టణ.. నగర ప్రాంతాలకు చెందిన ఓటర్లు పోలింగ్ డేను లాంగ్ వీకెండ్ గా భావించి.. ట్రిప్ కు ప్లాన్ చేస్తే మాత్రం.. దాని ఎఫెక్టు పోలింగ్ మీద ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు.
ఎవరు అవునన్నా.. కాదన్నా.. మన దేశంలో రాజకీయాలు మాత్రమే ప్రజల తలరాతల్ని మార్చటంతో పాటు.. జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. నిత్యం ఏదో అంశం మీద తిట్టుకునే ప్రజలు.. పాలకులుగా ఎవరు ఉండాలన్న అవకాశం తమ చేతికి వచ్చిన రోజును.. అల్ప ఆనందాల కోసం ట్రిప్పులకు ప్లాన్ చేయకుండా.. అందుకు భిన్నంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా చేసినా.. మన భవితను మనమే చెడగొట్టుకున్నట్లు అవుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.