ఎవరు ఎటువైపో..? కూటముల్లో ‘మహా’ గందరగోళం

ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించాయి. ప్రభుత్వంలోనూ భాగమయ్యాయి. అయితే, మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు గందరగోళంగా మారాయి.

Update: 2025-02-17 11:30 GMT

పెద్ద రాష్ట్రం.. కీలక నగరాలు.. రెండు జాతీయ పార్టీలు.. నాలుగు ప్రాంతీయ పార్టీలు.. అన్నీ బలమైనవే.. బహుశా దేశంలో మరే రాష్ట్రంలోనూ పరిస్థితి మహారాష్ట్రలో కనిపిస్తుంటుంది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు మూడేళ్లలో రెండు ముక్కలు కాగా.. వేరుపడిన ఆ ముక్కలే ప్రధాన పార్టీలయ్యాయి. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించాయి. ప్రభుత్వంలోనూ భాగమయ్యాయి. అయితే, మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు గందరగోళంగా మారాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ. అయితే, మహారాష్ట్రలో ఉన్నది మాత్రం బీజేపీ సారథ్యంలోని మహాయుతి. గత ఏడాది ఎన్నికల్లో మహాయుతి నెగ్గగా.. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) పార్టీల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఘోరంగా ఓడింది. తాజాగా ఈ రెండు కూటముల్లోని పార్టీల నేతల వ్యవహార శైలి చర్చనీయాంశం అవుతోంది. కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోంది.

మహాయుతిలో మహారాష్ట్ర సీఎంగా పనిచేసి.. ప్రస్తుతం

ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన అధినేత ఏక్‌ నాథ్‌ శిందేను ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ ప్రశంసించగా.. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తో శివసేన (ఉద్ధవ్‌) వర్గం భేటీ అవడమే దీనికి కారణం.

నవంబరులో జరిగిన ఎన్నికల్లో మహాయుతి, మహా వికాస్‌ అఘాడీ హోరాహోరీగా తలపడ్డాయి. మహాయుతి ఘన విజయం తర్వాత సీఎం అభ్యర్థి విషయంలో అధికార కూటమిలో, ఓటమిపై ప్రతిపక్ష కూటమిలో విభేదాలు తలెత్తాయి. అవన్నీ సర్దుకున్నా మళ్లీ రాజకీయ ప్రత్యర్థులతో భేటీలు చర్చలకు తావిస్తున్నాయి.

ఫడణవీస్‌ తో శివసేన (ఉద్ధవ్‌) నేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. మాజీ సీఎం ఉద్ధవ్ కుమారుడు, పార్టీ కీలక నేత ఆదిత్య ఠాక్రే రెండుసార్లు భేటీ అయ్యారు. ఫడణవీసే శివసేను చీల్చారని గతంలో తీవ్రంగా ఆరోపించారు ఉద్ధవ్‌ వర్గం నేతలు.

సీఎం ఫడణవీస్‌ మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేతోనూ భేటీ అయ్యారు. మామూలుగా అయితే ఇదేమంత విషయం కాదు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారాయి. దీంతో రెండు కూటముల్లోని పార్టీలు ప్రత్యర్థి పార్టీలతో అంటకాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరు దారికి రాకుంటే వేరే మార్గాలు ఉన్నాయని భాగస్వాములను హెచ్చరికలు పంపడానికే ఈ సమావేశాలు అని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకంతో అధికార కూటమిలో విభేదాలు పెరిగాయి. తమ మంత్రులకు అవకాశం ఇవ్వలేదని శివసేన తప్పుబట్టింది. దీంతో బీజేపీ మంత్రుల నియామకం ఆగిపోయింది.

ఇక మహా వికాస్‌ అఘాడీలో పార్టీల మధ్య మరిన్ని సమస్యలున్నాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏక్‌నాథ్‌ శిందేను శరద్‌ పవార్‌ పొగడడాన్ని శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రెండు రోజుల తర్వాత దిల్లీ వెళ్లిన ఆదిత్య ఠాక్రే.. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ను కలిశారు. అక్కడే ఉన్న శరద్‌ పవార్‌ ను మాత్రం కలవలేదు. కాగా, చాలా మంది శివసేన (ఉద్ధవ్‌) నేతలు ఎన్నికల్లో ఒంటరిగా వెళ్దామని ఉద్ధవ్‌ ఠాక్రేకు చెబుతున్నారు.

Tags:    

Similar News