ఇది చదివే వారికే చెమటలు పడతాయి.. ఇక ఫ్లైట్ ఉన్నోళ్ల మాటేంటి?

మీరిప్పుడు చదివే వార్త భయానికి గురి చేస్తుంది. మనల్ని మనం ఆ ఘటనలో ఉన్నట్లుగా ఊహించకుంటే ముచ్చమటలు పట్టేస్తాయి

Update: 2024-06-21 04:28 GMT

మీరిప్పుడు చదివే వార్త భయానికి గురి చేస్తుంది. మనల్ని మనం ఆ ఘటనలో ఉన్నట్లుగా ఊహించకుంటే ముచ్చమటలు పట్టేస్తాయి. చదవుతున్న మనకు ఇంత టెన్షన్ పడేలా.. చెమటలు పట్టేలా చేసే ఈ ఉదంతాన్ని నేరుగా అనుభవించిన 138 మంది ప్రయాణికుల మాటేమిటి? సిబ్బంది అంటే.. వారికో అవగాహన ఉంటుంది కాబట్టి ఫర్లేదు. కానీ.. సాంకేతిక అంశాల మీద అవగాహన లేని ప్రయాణికుల మాటేమిటి? అన్నది ప్రశ్న. గురువారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన మలేషియా ఎయిర్ లైన్స్ కు ఎదురైన పరిస్థితి గురించి తెలిస్తే నోట మాట రాదంతే. అసలేమైందంటే..

ఫారిన్ ట్రిప్ కు బయలుదేరారు. మీ విమానం టేకాఫ్ అయ్యింది. పదిహేను నిమిషాలకు విమానంలోని కుడి ఇంజిన్ లో టెక్నికల్ సమస్య వచ్చిందని తెలిస్తే మీ పరిస్థితేంటి? ఆ తర్వాత టేకాఫ్ కాకుండా.. మూడు గంటలు గాల్లోనే తిరుగుతుంటే పరిస్థితేంటి? అలాంటి పరిస్థితుల్లో మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించుకుంటనే కష్టంగా ఉండే ఈ ఉదంతం గురువారం తెల్లవారుజామున (అర్థరాత్రి 12.45 గంటలకు) శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కౌలాలంపూర్ కు బయలుదేరింది. 138 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం టేకాఫ్ అయిన పావు గంటకే విమాన కుడి ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి.

దీన్ని గుర్తించిన పైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనతో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టు వైపు మళ్లించారు. అయితే.. వెంటనే ల్యాండ్ అయ్యేందుకు అనుమతించలేదు. దీనికి కారణం.. ట్యాంకులో ఇంధనం నిండుగా ఉండటమే. వెంటనే ల్యాండ్ అయితే ప్రమాదం చోటు చేసుకునే వీలుందని భావించిన అధికారులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు.

దీంతో మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన పరిస్థితి. సాంకేతిక లోపం ఉందంటూనే.. టేకాఫ్ కాకుండా మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. అయితే.. సిబ్బంది సర్ది చెప్పినప్పటికీ ఏం జరుగుతుందో అర్థం కాక కిందా మీదా పడిన పరిస్థితి. చివరకు తెల్లవారుజామున 3.58 గంటల వేళలో విమనాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీంతో విమాన సిబ్బందితో పాటు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. ల్యాండింగ్ వేళలో.. ఇంజిన్ నుంచి నిప్పుడు ఎగిసిపడుతున్న వైనాన్ని తన సెల్ ఫోన్ లో తీసిన ప్రయాణికుడు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టటంతో కలకలం రేగింది. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే.. ఫ్లైట్ ట్యాంక్ లో ఫ్యూయల్ నిండుగా ఉండటంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత కొందరు తమ జర్నీని క్యాన్సిల్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం ఇంకో ఫ్లైట్ లో వెళ్లిపోయారు. మొత్తంగా మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ప్రయాణికులకు మృత్యు అనుభవాన్ని మిగిల్చిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News