ఓటు వేయకపోయినా.. అంత్యక్రియలకైనా హాజరవ్వండి.. ఖర్గే భావోద్వేగం!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి హోరెత్తిపోతుంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి హోరెత్తిపోతుంది. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తే... మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగం సైతం మారిపోతుందంటూ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది! తమను గెలిపించాలని కోరుకుంటుంది. ఈ సమయంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాల్లో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఖర్గే తీవ్ర భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అవును... లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తన సొంత జిల్లా, గుల్బర్గా లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో భాగంగా... ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడకున్నా.. తాను ప్రజల కోసం పని చేశానని భావిస్తే.. కనీసం తన అంత్యక్రియలకైనా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే క్రమంలో... ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే... మీ హృదయాలను గెలవలేకపోయానని, నాకు ఇక్కడ చోటు లేదనే తాను భావిస్తానని చెప్పిన ఖర్గే... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా.. లేకున్నా.. నేను ఈ ప్రాంతానికి పని చేశానని నమ్మితే.. కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దీంతో... ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి!
ఇక తాను రాజకీయాల కోసమే పుట్టానని.. ఎన్నికల్లో పోటీ చేసినా, పోటీ చేయకపోయినా.. చివరి శ్వాస వరకూ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృష్హి చేస్తానని ఖర్గే స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆర్.ఎస్.ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఓడించేందుకు పోరాడతానని.. ఈ విషయంలో వాళ్ల ముందు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాగా... గుల్బర్గా నియోజకవర్గం నుంచి నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన ఖర్గే.. 2019 లో ఓడిపోయారు! ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఆయన అల్లుడు దొడ్డమాని రాధాకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఉమేశ్ జి జాదవ్ బరిలో ఉన్నారు.