మమత సతమతం...కత్తులతో కమలం

మమతా బెనర్జీకి ఇది సీఎం గా ఒక పెను సవాల్ గా మారింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశమంతా మండిపోతోంది.

Update: 2024-08-18 04:03 GMT

రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదొక జీవితం. అక్కడ కూడా కర్మలు చీడలూ పీడలు వెంటాడుతుంటాయి. మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎం గా ఉంటూ చాన్స్ దొరికితే పీఎం సీటుకే టార్గెట్ అన్నట్లుగా ఒక రేంజిలో ఉన్న మమత గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయే విధంగా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యోదంతం ఘటనలు జరిగాయి.

ఇది దేశమే కాదు ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా సాగింది. దేశం వరకూ చూస్తే 2012లో జరిగిన నిర్భయ హత్య తరువాత అంతటి స్థాయిలో దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక ట్రైనీ డాక్టర్ ని కాపాడలేని దుస్థితిలో స్టేట్ ఉందా అన్న విమర్శలు కూడా ఎక్కు పెడుతున్నారు. అంతే కాదు ఒక మహిళ సీఎం గా ఉన్న చోట కూడా మహిళా భద్రత ఇంతేనా అని నిప్పులు కురిపిస్తున్నాయి.

మమతా బెనర్జీకి ఇది సీఎం గా ఒక పెను సవాల్ గా మారింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశమంతా మండిపోతోంది. డాక్టర్లు అయితే ఆందోళనలు తీవ్రతరం చేశాయి. ఈ దారుణం ఎవరు చేసినా ఎలా జరిగినా బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అంటున్నారు.

అందుకే ఒకనాడు ఇలాంటి దుశ్చర్యల వల్లనే తన కుమార్తెను పోగొట్టుకున్న నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయకపోగా స్వయంగా తానే నిరసనలో పాల్గొనడం విడ్డూరమన్నారు. సీఎంగా ఉండి అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇది నిజంగా నిశితమైన విమర్శగానే చూదాలి. మమత ఒక సాధారణ మహిళ కాదు. ఆమె రాష్ట్రానికి అధినేత అత్యాచార ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే స్థాయిలో ఆమె ఉన్నప్పటికీ అలా చేయలేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైనందుకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేశారు.

మరో వైపు కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఏకంగా 42 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరోవైపు ఇంతమంది వైద్యులను బదిలీ చేయడంపై మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిరసన ఉద్యమంలో పాల్గొన్నందుకు శిక్షగానే ఇంత మందిని బదిలీ చేశారని విమర్శించారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని యునైటెడ్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. డాక్టర్ల బదిలీలు పూర్తిగా అన్యాయమని తెలిపింది.

ఇంకో వైపు చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇందుకు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచారమే నిదర్శనమని బీజేపీ ఇదే అదనుగా కత్తులు దూస్తోంది. ఇందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాదీ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో చట్టబద్ధమైన పాలన లేదన్నారు. ఈ కేసులోని నిందితులకు తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే నిందితులకు రక్షించేందుకు మమతా బెనర్జీ ఆసక్తి చూపిస్తున్నారన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే జూనియర్ డాక్టర్ హత్యతో కోల్‌కతా అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగానూ దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌పై బీజేపీ, సీపీఎం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘటన జరిగిన ఆసుపత్రి వద్దకు ర్యాలీ నిర్వహించారు. మమత ఒక సీఎంగా ఉంటూ తానే నిరసనలు చేయడం మీద విమర్శలు వస్తున్నాయి.

ఇంకో వైపు ఇండియా కూటమి సైలెంట్ అయింది. అటు పెద్దగా ఈ ఘటన మీద విమర్శలూ చేయలేదు. అయితే మమతకు దన్నుగా నిలబడలేదు. కానీ ఈ సమయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు. మమతను రాజకీయంగా బీజేపీ టార్గెట్ చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా రాజకీయ సుడిగుండంలో చిక్కుకుని మమత సతమతమవుతున్నారు. ఆమెని ఇదే అదనుగా చేసుకుని బీజేపీ తన వ్యూహాలతో చెడుగుడు ఆడుతోంది. మరి ఇది ఏ విధంగా ముందుకు సాగుతుందో మమత పొలిటికల్ గా ఎలా ఈ సవాల్ ని స్వీకరిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News