'ఇండియా'లో జి-20 విందు సెగలు.. మమత తీరుపై అనుమానాలు

అంతేకాదు.. జి20 విందులో మమతా బెనర్జీ పాల్గొనడానికి ఇంకేమైనా కారణం ఉందా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Update: 2023-09-11 08:52 GMT

చూస్తూ ఉంటే.. ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పనికాదని స్పష్టమవుతోంది. ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని సమయంలో ఇండియా ఇంకా బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. కూటమి నేతలు తలో దిక్కు లాగుతూ చిందరవందర చేసేలా ఉన్నారు. కీలకమైన రాజకీయ అంశాలపై ఎలా వ్యవహరించాలో వారికి తెలియడం లేనట్లుంది. తాజాగా జి20 సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు మరింత మంట పుట్టిస్తోంది.

ప్రతిష్ఠాత్మక సమావేశాల విందుకెళ్లి..

జి-20 సమావేశాలను మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా ప్రపంచ దేశాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం వీరికి ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. దీనికి ప్రొటొకాల్ రీత్యా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకాగా.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌, ఒడిశా సీఎంలు గైర్హాజరయ్యారు.

మమతాదీ విందుకెళ్లకుంటే మునిగిందేమిటి?

జి20 సమావేశాల సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన విందుకు మమతా హాజరు కావడంపై కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత, బెంగాల్ కే చెందిన అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'జి20 విందుకు మమతా వెళ్లకపోయుంటే.. ఆకాశమేమీ ఊడి పడిపోదు' అంటూ విమర్శించారు. అంతేకాదు.. జి20 విందులో మమతా బెనర్జీ పాల్గొనడానికి ఇంకేమైనా కారణం ఉందా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విందు వరుసలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పక్కన మమతా కుర్చీ ఉండటంపైనా అధీర్ మండిపడ్డారు. పలువురు విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొనడం మానుకున్నారని, అయితే మమతా బెనర్జీ విందుకు ముందుగానే దిల్లీ చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ముందురోజే ఢిల్లీ వెళ్లి..

జి20 విందుకు శనివారం జరిగింది. కానీ, మమతా బెనర్జీ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం షెడ్యూల్ ప్రకారం శనివారం చేరుకోవల్సి ఉన్నప్పటికీ ముందురోజే వచ్చేశారు. దీనివెనుక అనుమానాలేమీ లేవు. ఎందుకంటే విమాన కార్యకలాపాల నిబంధనల కారణంగా మమతా బెనర్జీ ప్రయాణించాల్సిన విమానాన్ని శుక్రవారం మధ్యాహ్నానికి రీషేడ్యూల్ చేశారు. కాగా, అధిర్ వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్‌ స్పందిస్తూ.. 'బెంగాల్ సీఎం ఎప్పుడు వెళ్లాలనేది మీరు నిర్ణయించరు. ఆమె ఇండియా కూటమిలో ఒకరని అందరికి తెలుసు. ఆమె ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రొటోకాల్‌ను అనుసరించారు. దాని గురించి ఆమెకు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు ' అని సమాధానమిచ్చారు.

మరి నీతీశ్ సంగతేమిటో?

మోదీపై ఒంటికాలు మీద లేస్తూ వస్తున్న ప్రతిపక్షాలు చాలావరకు జి20 విందును బహిష్కరించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాలే విందుకు వెళ్లలేదు. కానీ, ఇండియా కూటమికి పునాది వేసిన వారిలో ఒకడైన బిహార్ సీఎం నీతీశ్ కుమార్ హాజరవడం గమనార్హం. దీంతోనే మూడు భేటీలు పూర్తయినా ఇండియా కూటమికి ఇప్పటికీ ఒక రాజకీయ నిర్దేశం లేదనే కథనాలు వస్తున్నాయి. రాజకీయంగా విభేదించిన నేపథ్యంలో మోదీని దీటుగా ఎదుర్కొనే పద్ధతి ఇది కాదనే విశ్లేషణలు చేస్తున్నారు.

Tags:    

Similar News