మెగా బ్రదర్‌ పోటీ అక్కడి నుంచి ఖాయం!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి.

Update: 2023-11-14 04:36 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. జనసేన–టీడీపీ ఈసారి కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను సైతం రూపొందించాయి. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లకు ఆ మేనిఫెస్టోను చూపించాక విడుదల చేయనున్నాయి.

కాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపైనా జనసేన పార్టీ గట్టి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి కోర్‌ బెల్టుగా చెప్పబడుతున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన పార్టీయే పోటీ చేయనుందని తెలుస్తోంది. కాకినాడ నుంచి మెగా బ్రదర్, జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పవన్‌ చెప్పారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు.

అయితే ఈసారి నరసాపురం లోక్‌ సభా స్థానం నుంచి ప్రస్తుతం వైఎస్సార్సీపీ రెబల్‌ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని అంటున్నారు. టీడీపీ లేదా జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు కాకినాడ నుంచి బరిలోకి దిగుతారని పేర్కొంటున్నారు.

సామాజికవర్గపరంగా, మెగాభిమానుల పరంగా కాకినాడ నుంచి అయితే సులువుగా గెలుపు సాధించవచ్చని నాగబాబు భావిస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌ తక్కువ మెజారిటీతోనే ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో కాకినాడ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన జ్యోతుల వెంకటేశ్వరరావు మూడో స్థానంలో నిలిచారు.

ఈ నేపథ్యంలో నాగబాబు వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేయడం ఖాయమేనని అంటున్నారు. సామాజిక సమీకరణాలు, మెగాభిమానులతోపాటు టీడీపీ పొత్తులో తాను సులువుగా గెలుపొందొచ్చని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాకినాడ సీటును జనసేన పార్టీకి ఇచ్చేందుకు టీడీపీ కూడా అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి నాగబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతారని చర్చ నడిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, పొత్తు, తదితర అంశాలతో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News