ఎవరు ఎడిట్ చేశారో కానీ.. 'వియు మిస్ ఆల్ ద ఫన్'
ఈ వీడియోకు పెట్టిన క్యాప్షన్ 'వియు మిస్ ఆల్ ద ఫన్' పుణ్యమా అని ఆ లోటు భర్తీ అయ్యే పరిస్థితి.
నోటితో చెప్పాలనుకున్న ఎన్నో భావాల్ని.. నోరు తెరవకుండా ఒక్క చిట్టి వీడియోతో చెప్పేసే ట్రెండ్ మొదలై చాలా కాలమే అయ్యింది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. కొన్ని వీడియోల్ని చూసినప్పుడు దాన్ని తయారు చేసినోడి టాలెంట్ కు ఫిదా కావాల్సిందే. చివరకు తమను తిట్టిపోసేలా ఉన్న వీడియోను చూసినప్పుడు కూడా.. తమను తిట్టారన్న కోపం కంటే.. ఎంత బాగా ఎడిట్ చేశాడ్రా వీడు.. అన్న భావన కలిగే కొన్ని వీడియోలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారింది.
నిమిషం కంటే తక్కువ నిడివి (సరిగ్గా చెప్పాలంటే 58 సెకన్లు) ఉన్న ఈ వీడియో ఓపెనింగ్ లోనే వైసీపీ ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని.. ఆర్కే రోజాలు దర్శనమివ్వటం.. దాని బ్యాక్ గ్రౌండ్ లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ మూవీని పాట రావటం.. ఆ పాటలోని పదాలకు తగ్గట్లు ఫ్రేములు ఉండకపోవచ్చు కానీ.. కాస్తంత దగ్గరగా ఉండటం కనిపిస్తుంది. ఈ వీడియోకు పెట్టిన క్యాప్షన్ ‘వియు మిస్ ఆల్ ద ఫన్’ పుణ్యమా అని ఆ లోటు భర్తీ అయ్యే పరిస్థితి.
ఐదేళ్ల జగన్ పాలనలో చోటు చేసుకున్న పరిణామాల్ని కొన్ని ఘటనలు.. కొందరు వ్యక్తుల తీరును చూపించటం ద్వారా మొత్తం ఫీల్ ను తెచ్చే టాలెంట్ ఈ వీడియోకు ఉందని చెప్పాలి. ఐదేళ్ల అరాచక పాలన అని ఆగ్రహంతో చిందులు వేసే వారు సైతం.. ఈ నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోను చూసిన తర్వాత చిన్న స్మైల్ ఇచ్చేలా చేస్తుంది.
ఈ వీడియోలో రాధ జడలో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు.. రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు..శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు.. కైలాషు కూసిన కారుకూతలు..కల్యాణి పేల్చిన లెంపకాయలు..మరపురాని.. తిరిగిరాని గురుతులండి’’ అంటూ వచ్చే పాటకు ప్లే అయ్యే సన్నివేశాలు ఈ వీడియో మొత్తానికి హైలెట్ అని మాత్రం చెప్పకుండా ఉండలేం.
తమను ఇంతలా టార్గెట్ చేసిన ఈ వీడియో చేసినోడి సంగతి చూడాలన్న భావన వీరాభిమానుల్లోనూ కలుగకుండా ఉండటం ఈ వీడియో ప్రత్యేకత. దీనికి కారణం.. చివర్లో డిస్ క్లేమర్ మాదిరి వచ్చే పాటలోని ‘‘మీ మనసును నొచ్చుకుంటే మన్నించండి’’ పంక్తులు.. కోపాన్ని కంట్రోల్ చేయటమే కాదు.. వీడియో ఎడిట్ చేసినోడి నేర్పరితనానికి ఫిదా కాకుండా ఉండలేం. ఇంత హైప్ చేస్తున్నారనుకోవచ్చు కానీ.. వీడియోను అసాంతం చూసిన తర్వాత మాత్రం మీ ఫీల్ లో తేడా రావటం ఖాయం.