దిగ్గజ సంగీత దర్శక వాణిలో.. హోరెత్తనున్న "జయ జయహే తెలంగాణ"

ఆస్కార్ విజేత రాగంలో ఆస్కార్ అవార్డు గ్రహీత, తెలుగు వారు గొప్పగా చెప్పుకునేంతటి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. జయజయహే తెలంగాణ గీతానికి బాణీలు కట్టనున్నారు.

Update: 2024-05-21 11:45 GMT

ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మూడో ప్రయత్నంలో మాత్రం ఏ అవకాశమూ ఇవ్వకుండా గెలుపును కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా చేసిన పోరాటానికి తోడు పార్టీ నాయకులంతా ఏకతాటిన నిలవడంతో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించగలిగింది. వాస్తవానికి ఏడాది, ఏడాదిన్నర కిందటి వరకు కూడా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడిస్తుందని ఎవరూ నమ్మలేదు. అయితే, కాలం కలిసివచ్చి హస్తం రైజ్ అయింది.

కీలక మార్పులకు సిద్ధం తెలంగాణలో డిసెంబరు 7న అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు కీలక మార్పులకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతోంది. మరోవైపు తమదైన పాలనను చూపుతోంది. ఇందులో భాగంగా సర్కారు ఏర్పడిన తొలి రోజుల్లోనే రాష్ట్ర గీతంగా ‘‘జయ జయ హే తెలంగాణ’’ను ప్రకటించింది. వాస్తవానికి తెలంగాణ అస్తిత్వంతో పోరాటం సాగించి రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర గీతం ఇదీ అని ప్రకటించకపోవడం గమనార్హం.

అందెశ్రీ కలం నుంచి..

జయజయహే తెలంగాణ ప్రముఖ కవి అందెశ్రీ కలం నుంచి జాలువారింది. జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ! జైజై తెలంగాణ!! పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్‌ జై తెలంగాణ! జైజై తెలంగాణ!! అంటూ సాగే ఈ గీతం ప్రతి తెలంగాణ వాదిని ఉర్రూతలూగిస్తుంది. జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి తరుగనిదీ నీత్యాగం మరువనదీ శ్రమ యాగం.. జై తెలంగాణ! జైజై తెలంగాణ!! అంటూ ఉరుకులెత్తిస్తుంది. ఇప్పుడు ఈ ఘనమైన గీతానికి మరింత ఘనమైన సంగీతం తోడుకానుంది.

ఆస్కార్ విజేత రాగంలో ఆస్కార్ అవార్డు గ్రహీత, తెలుగు వారు గొప్పగా చెప్పుకునేంతటి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. జయజయహే తెలంగాణ గీతానికి బాణీలు కట్టనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఈ ఘనమైన బాధ్యతను అప్పగించారు. కీరవాణి, అందెశ్రీ మంగళవారం ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ను కలిశారు. వారిద్దరినీ ఘనంగా సన్మానించిన రేవంత్.. అప్పగించనున్న పని గురించి వివరించారు.

జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన విడుదల జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా కీరవాణి జయజయహే తెలంగాణ గీతానికి సంబంధించిన తాను కట్టిన బాణీలను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News