బైడెన్ తో మోడీ చేసుకున్న డీల్స్ ఇవే

ఇరు దేశాధినేతల చర్చల్లో భాగంగా భారత్ - అమెరికా మధ్య బిలియన్ డాలర్ల డ్రోన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Update: 2024-09-22 06:00 GMT

తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. బైడెన్ నివాసంలో జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాధినేతలు ప్రాంతీయ.. ప్రపంచ అంశాలపై చర్చలు జరిపారు. బైడెన్ తో తాను జరిపిన చర్చలు ఫలవంతమైనట్లుగా మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. బైడెన్ సొంతూరులోని సొంతింట్లో జరిగిన ఈ చర్చల గురించి మోడీ స్పందిస్తూ.. ‘‘డెలావర్ గ్రీన్ విల్లేలోని తన నివాసంలో నాకు అతిథ్యం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ కు ధన్యవాదాలు. మా చర్చలు ఫలవంతమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ.. ప్రపంచ సమస్యలపై చర్చించటానికి మాకు అవకాశం లభించింది’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సమావేశానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. తనను కలిసిన ప్రతిసారీ ఇరుదేశాల మధ్య సహకారానికి సంబంధించి కొత్త రంగాలను కనుగొనడంలో ప్రధాని మోడీ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లుగా పేర్కొన్నారు. ‘‘ఈ బంధం చాలా సన్నిహితమైనది. చైతన్యవంతమైనది. భారత్ తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడు లేనంత బలమైంది. మేమిద్దరం భేటీ అయిన ప్రతిసారీ ఒక కొత్త సహకార రంగాన్ని కనుగొనడంలో మోడీ సామర్థ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఈ రోజు సమావేశంలో అదే జరిగింది’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇరు దేశాధినేతల చర్చల్లో భాగంగా భారత్ - అమెరికా మధ్య బిలియన్ డాలర్ల డ్రోన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. డ్రోన్ డీల్ పై కూడా ఇరువురు నేతలు పూర్తిస్థాయిలో చర్చించుకున్నారు. అమెరికా నుంచి భారత్ కు 31 ఎంక్యూ9బీ స్కై గార్డియన్ సీ గార్డియన్ డ్రోన్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అయ్యే ఖర్చు మూడు బిలియన్ డాలర్లు. ఈ డ్రోన్లను చైనా సరిహద్దు వెంబడి సాయుధ బలగాల నిఘా యంత్రాంగాన్ని పెంచటమే భారత్ లక్ష్యంగా చెబుతున్నారు.

ఈ డీల్ కు సంబంధించి గత ఏడాది నుంచి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్ లో రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదాన్ని పొందింది. డ్రోన్ కొనుగోళ్లతో పాటు భారత నావికాదళం ఈ ఏడాది మరో రెండు ప్రధాన రక్షణ ఒప్పందాల్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. మూడు స్కార్పెన్ జలాంతర్గాములు.. 26 రాఫెల్ ఎం యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది.

ఇదిలా ఉండగా.. క్వాడ్ సదస్సులో మోడీ కీలక ప్రకటన చేశారు. ఇండో - పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ వ్యాక్సిన్ డోస్ లను అందజేస్తామని చెప్పారు. ఈ 40 మిలియన్ వ్యాక్సిన్ డోసులు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో ఆశాకిరణంగా మారతాయన్నారు. అంతేకాదు..గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో నైపుణ్యాన్ని పంచుకోవటానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. గర్భాశయ క్యాన్సర్ కు వ్యతిరేకంగా భారత్ సొంతంగా వ్యాక్సిన్ డెవలప్ చేసిందని.. ఏఐతో కొత్త ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ ను కూడా ప్రవేశ పెడుతున్నట్లుగా చెప్పారు. తమ అనుభవాల్ని.. నైపుణ్యాల్ని పంచుకోవటానికి భారత్ సిద్దంగా ఉందన్నారు.

Tags:    

Similar News