.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

బాబు-మోడీల 'కాఫీ' ముచ్చ‌ట్లు!

ఢిల్లీలో ఉండే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీని, ఏపీలో ఉంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తాజాగా 'కాఫీ' క‌లిపింది

Update: 2024-06-30 18:35 GMT

ఢిల్లీలో ఉండే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీని, ఏపీలో ఉంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తాజాగా 'కాఫీ' క‌లిపింది. కాఫీ ముచ్చ‌ట్ల‌తో ఈ ఆదివారం ఇరువురూ.. ఖుషీ అయ్యారు. అర‌కు కాఫీని చంద్ర‌బాబుతో క‌లిసి తాగాన‌ని మోడీ చెప్పారు. త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని.. ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను మ‌రిచిపోలేన‌ని మోడీ చెప్పారు. త‌న జీవితంలో అదొక మ‌ధురానుభూతి అని మోడీ పేర్కొన్నారు. అయితే.. మోడీ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తిగా చంద్ర‌బాబు కూడా.. స్పందించారు. మ‌రోసారి మోడీతో కాఫీ తాగాల‌ని ఉందంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు.

అస‌లు ఏం జ‌రిగింది?

ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం .. దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న‌సులో మాట‌(మ‌న్ కీ బాత్‌) పంచుకుంటున్నారు. 2014లో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా కొన‌సాగుతోంది. తాజాగా మూడో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. తొలి మ‌న్‌కీ బాత్ జూన్ 30(ఆదివారం) ప్ర‌సారం అయింది. దీనిలో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. గ‌త సంగ‌తులు గుర్తు చేసుకుని.. చంద్ర‌బాబుతో తాను కాఫీ తాగిన విష‌యాన్ని నెమ‌రు వేసుకున్నారు. ప్ర‌ధానంగా అర‌కు కాఫీ గురించి మోడీ ప్ర‌స్తావించారు.

Read more!

అరకు కాఫీ అద్భుతమ‌ని ప్ర‌ధాని మోడీ కొనియాడారు. స్థానికంగా ఉన్న కొండదొరలు అరకు కాఫీలోని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో ఆయ‌న‌ వివరించారు. వాళ్ల సంస్కృతి, ఆచారాలను వదులు కోకుండా కొన‌సాగ‌డం గొప్ప విషయమని అన్నారు. ఈ సంద‌ర్భంగానే గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. విశాఖ పట్నంలో ఓసారి అప్ప‌టి సీఎం చంద్రబాబుతో కలిసి అర‌కు కాఫీని ఆస్వాదించాన‌ని మోడీ పేర్కొన్నారు. ఆ మ‌ధుర క్షణాలను తాను ఎప్ప‌టికీ మర్చిపోలేనన్నారు.

మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌న్ కీ బాత్‌లో అర‌కు కాఫీ గురించి ప్ర‌శంస‌లు గుప్పించ‌డం.. త‌న‌తో క‌లిసి కాఫీ తాగిన సంద‌ర్భాల‌ను నెమ‌రు వేసుకోవ‌డంపై సీఎం చంద్ర‌బాబు మురిసిపోయారు. ''మోడీ స‌ర్‌.. మీతో క‌లిసి మ‌రో క‌ప్‌.. అర‌కు కాఫీ తాగాలని ఉంది'' అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ముచ్చ‌ట‌.. ఇటు బీజేపీ, అటు టీడీపీ నేత‌ల్లో హుషారు నింపింది.

Tags:    

Similar News