ఆ 'నిబంధన'.. మోదీని బీజేపీ పక్కనపెట్టగలదా?

కాగా తాము ఈసారి 400 సీట్లు సాధిస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Update: 2024-05-22 13:20 GMT

దేశంలో లోక్‌ సభకు ఇప్పటివరకు ఐదు విడతల పోలింగ్‌ పూర్తయింది. ఇంకో రెండు విడతలు మిగిలి ఉన్నాయి. జూన్‌ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా తాము ఈసారి 400 సీట్లు సాధిస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోసారి అధికారం తమదేనని చెబుతోంది.

అయితే బీజేపీలో '75 ఏళ్ల వయసు' నిబంధనను గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీజేపీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాక ఈ '75 ఏళ్ల వయసు' నిబంధన అనే సాకుతో చాలా మంది బీజేపీ నేతలను బలవంతంగా రాజకీయాల నుంచి తప్పించారనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా బీజేపీ మూలస్తంభాలుగా చెప్పబడే మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషిలతోపాటు మరో సీనియర్‌ నేత లాల్జీ టాండన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వంటివారిని ఈ ‘75 ఏళ్ల వయసు’ నిబంధనతోనే ప్రధాని మోదీ, అమిత్‌ షా పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి.

కాగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రస్తుతం 73 ఏళ్ల 7 నెలల వయసు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నిర్దేశించిన 75 ఏళ్ల వయసుకు మోదీకి ఇంకా దాదాపు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రధానమంత్రి అయితే ఏడాదిన్నర పదవీకాలం పూర్తికాగానే ఆయనకు 75 ఏళ్లు నిండిపోతాయి. మరి అప్పుడు ఆయన బీజేపీ పెట్టుకున్న నిబంధన ప్రకారం ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఒడిశాలో ప్రచారం చేస్తున్న అమిత్‌ షా.. 77 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ ను వయసై పోయిందని తప్పుకోమంటున్నారని.. మరి ఇదే సలహా ప్రధాని మోదీకి అమిత్‌ షా ఇవ్వగలరా అని నిలదీశారు. నవీన్‌ పట్నాయక్‌ తప్పుకోమంటున్న అమిత్‌ షా పరోక్షంగా ప్రధాని మోదీకి ఈ విషయాన్ని చెబుతున్నట్టేనా అని ప్రశ్నించారు.

మళ్లీ ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మోదీని పక్కనపెట్టి అమిత్‌ షా ప్రధాని పదవిని లాక్కునే యోచనలో ఉన్నారని చిదంబరం వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు.

ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకుంటే ప్రతిపక్ష నేత బాధ్యతలను అమిత్‌ షా చేపడతారని తెలుస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు.

అయితే మోదీకి 75 ఏళ్లు నిండినా ఆయనే ప్రధానిగా ఉంటారని ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు వివిధ సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి తాజాగా కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ప్రస్తుత హోం మంత్రి అమిత్‌ షా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News