కోవిడ్ వల్ల చంద్రుడు చల్లబడ్డాడు.. అసలేం జరిగింది?

భూవాతావారణంలో మార్పులకు, చంద్రుడికీ మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం తాజాగా తెరపైకి వచ్చింది.

Update: 2024-10-01 04:03 GMT

భూవాతావారణంలో మార్పులకు, చంద్రుడికీ మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం తాజాగా తెరపైకి వచ్చింది. భూమిపై జరుగుతున్న మార్పులు చంద్రుడిపైనా ప్రభావం చూపుతాయని స్పష్టంగా తెలిసిందే. ఇందులో భాగంగా... కరోనా వైరస్ నియంత్రణకు అమలుచేసిన లాక్ డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని భారతీయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది.

అవును... కోవిడ్-19 మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్వచ్చమైన గాలి పీల్చుకునే అవకాశం కలిగిందనే మాటలు వినిపించాయి. అయితే.. ఇది కేవలం భూగ్రహానికే పరిమితం కాలేదనే విషయం తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.

ఇందులో భాగంగా... లాక్ డౌన్ కారణంగా చంద్రుడిపై రాత్రి ఉష్ణోగ్రత 8 నుంచి 10 కెల్విన్ లకు పడిపోయినట్లు గుర్తించారు పరిశోధకులు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రీకానాస్నెస్ ఆర్బిటర్ డేటాను విశ్లేషించిన పరిశోధకులు... జాబిల్లిపై ఉష్ణోగ్రతల తగ్గుదల, భూమిపై మానవ కార్యకలాపాలలో తగ్గింపుతో సమానంగా ఉందని కనుగొన్నారు.

అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకుల బృందం... 2017 నుంచి 2023 మధ్య చంద్రుడి ఉపరితలంపై ఆరు ప్రదేశాల్లో ఉష్ణోగ్రతల డేటాను విశ్లేషించింది. దీనిపై స్పందించిన పరిశోధకులు... భూమికి సన్నిహితంగా ఉండే చంద్రుడితో పరస్పర చర్యను అన్వేషించడంలో ప్రాముఖ్యతను ఈ అధ్యయనం నొక్కి చెప్పిందని అన్నారు.

ఇదే సమయంలో... 2020ల్లో నమోదైన ఉష్ణోగ్రతల్లో తగ్గుదల భూమిపై మానవ కార్యకలాపాలు చంద్రుడిని ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించడానికి ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని అందించిందని తెలిపారు. ఇది ప్రపంచ మానవ కార్యకలాపాల ప్రభావాలపై తాజా దృక్పథాన్ని అందిస్తోందని స్పష్టం చేశారు.

ఒక్కమాటలో చెప్పాలంటే... భూమిపై మానవ చర్యలు విశ్వాన్ని ఎల ప్రభావితం చేస్తాయనేదానిపై అవగాహనను పెంపొందించడానికి ఇది కీలకంగా మారిందని అన్నారు! అయితే... ఈ పరిశోధన ఈ విషయంలో బలమైన ఆధారాలను అందించినప్పటికీ.. భూమి-చంద్రుని మధ్య సంబంధాన్ను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మరింత సమాచారం అవసరమని తెలిపారు.

Tags:    

Similar News