పసి బిడ్డకు తల్లి ప్రేమను దూరం చేసిన లిఫ్ట్

ఏ మహిళకు అయినా తల్లి అవ్వడం గొప్ప అనుభూతినిస్తుంది. తన బిడ్డలతో అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంటారు.

Update: 2024-12-06 08:03 GMT

ఏ మహిళకు అయినా తల్లి అవ్వడం గొప్ప అనుభూతినిస్తుంది. తన బిడ్డలతో అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. సరిగా అలాంటి అనుభూతిని పొందిన ఓ తల్లి అంతలోనే కనుమూసింది. బిడ్డని కని వెంటనే తనువు చాలించింది.

ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. యూపీలోని లోహియా‌నగర్‌లోని క్యాపిటల్ ఆసుప్రతిలో ఓ మహిళ శుక్రవారం ప్రసవించింది. కరిష్మా అనే మహిళ ప్రసవించగా.. ఆమెను అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని వార్డుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. లిఫ్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలింది. లిఫ్ట్ కిందకు దిగడం ప్రారంభం అయ్యాక.. దాని కేబుల్ తెగిపోయింది. దాంతో అది క్రాష్ అయింది. ఆమెతోపాటు ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది కూడా లిఫ్ట్‌లోనే ఉన్నారు.

ఈ ఘటనలో కరిష్మా తలకు, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గాయపడిన మరో ఇద్దరిని 45 నిమిషాల తర్వాత లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి వారిని రక్షించారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారని పేషెంట్ బంధువులు ఆరోపించారు. కరిష్మా చనిపోయిందని తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు హాస్పిటల్ వద్ద గొడవకు దిగారు. ఆస్తులను ధ్వంసం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

అదే గందరగోళం మధ్య ఆసుపత్రిలోని మరో 13 మంది రోగులను వేరే హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. లిఫ్ట్‌ను బాగు చేయించడంలో ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం చేయడం, కరిష్మాకు సరైన సమయంలో వైద్యం అందించకపోవడం వల్లే చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. సిబ్బంది అలసత్వం వల్లే తన భార్యను కోల్పోయానని కరిష్మా భర్త పేర్కొన్నాడు. మరోవైపు... ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా స్పందించారు. ఓవర్ లోడ్ కారణంగానే లిఫ్ట్ కేబుల్ తెగిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. లిఫ్ట్ మెయింటనెన్స్ రికార్డులను పరిశీలిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆసుపత్రి లైసెన్సును సైతం రద్దు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News