బాబు కోసం మోత్కుపల్లి దీక్ష... అదే జరిగితే రేవంత్ సీఎం అంట!

ఈ క్రమంలో... దసరా వేడుకలకు ఆయన దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.

Update: 2023-10-23 12:41 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైనప్పటి నుంచీ మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కెరీర్ లో లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశ పెట్టారని.. అలాంటి వ్యక్తి 300 కోట్లు అవినీతి చేయడం ఏమిటి అనే లాజిక్ కూడా ఆయన తీశారు. ఈ నేపథ్యంలో దసరా రోజు చంద్రబాబు కోసం దీక్షకు దిగారు మోత్కుపల్లి నరసింహులు!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 43 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా బేగంపేటలోని తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ క్రమంలో... దసరా వేడుకలకు ఆయన దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా... చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని మొదలుపెట్టిన ఆయన... జైల్లో కిరాతకులుండాలి కానీ, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... మీరు జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా అంటూ జగన్ ని ప్రశ్నించిన ఆయన... చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో జగన్‌ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా? అని ప్రశ్నించిన మోత్కుపల్లి... వైఎస్సార్ పాలించినా ఇంత కుట్ర చేయలేదని, ఇకపై కుట్రలను ప్రజలు సాగనివ్వరని తెలిపారు. అదేవిధంగా... పేద ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారని ఫైరయ్యారు. అవన్నీ ఒకెత్తు అయితే... చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించడం గమనార్హం!

ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలు, రాబోయే ఎన్నికలు, వాటిలో వచ్చే ఫలితాలు, కాబోయే ముఖ్యమంత్రి మొదలైన విషయాలపైనా మోత్కుపల్లి స్పందించారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అని జోస్యం చెప్పిన ఆయన... రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి రాబోతుందని చెప్పుకొచ్చారు! ఇదే సమయంలో ఎవరు కాదన్నా రేవంత్ రెడ్డి వలనే కాంగ్రెస్ బలపడిందని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు!

కాగా... రెండురోజుల క్రితం ట్యాంక్‌ బండ్‌ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పురుగుల మందు డబ్బాతో హల్‌ చల్ చేశారు. ఈ సమయంలో... సీఎం కేసీఆర్‌ ను సమర్థించి తప్పుచేశానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... చంద్రబాబు ప్రాణానికి ఏమైనా హాని జరిగితే బీజేపీ, జగన్, కేసీఆర్‌ దే బాధ్యత అని కామెంట్ చేశారు.

Tags:    

Similar News